కాళేశ్వరంపై సుప్రీం రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ కమిటీ

కాళేశ్వరంపై సుప్రీం రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ కమిటీ
  • యాదాద్రి.. భద్రాద్రి పవర్ ప్లాంట్లు, విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్‌‌‌‌ నరసింహారెడ్డితో మరో కమిటీ
  • 100 రోజుల్లోనే విచారణ పూర్తి చేస్తం
  • అర్హులైనవారికి త్వరలోనే తెల్ల రేషన్ కార్డులు
  • 16 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
  • 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లకు రూ.22,500 కోట్లు
  • 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు
  • రెండు రోజుల్లో 93 శాతం రైతులకు రైతుబంధు వేస్తం
  • ఎస్​హెచ్​జీల ఉత్పత్తుల మార్కెటింగ్​కు ఔటర్ దగ్గర జాగా.. రాష్ట్ర కేబినెట్​ భేటీలో నిర్ణయాలు

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు న్యాయవిచారణ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. విచారణ కమిటీ చైర్మన్‌‌‌‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ పినాకి చంద్ర ఘోష్​ను నియమించింది. అలాగే యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్లు, గత ప్రభుత్వం చత్తీస్​గఢ్ నుంచి చేసిన విద్యుత్‌‌‌‌ కొనుగోళ్లపై ఎంక్వైరీకి మరో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్‌‌‌‌గా జస్టిస్‌‌‌‌ నరసింహారెడ్డిని నియమిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అర్హులైన పేదలందరికీ కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు సంబంధించి 16 కొత్త కార్పొరేషన్‌‌ల ఏర్పాటుకు కేబినెట్‌‌ ఆమోదం తెలిపింది. నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలో నలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లకు, రూ.22,500 కోట్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. మరో రెండు రోజుల్లో 93 శాతం రైతుబంధు ఇవ్వాలని నిర్ణయించారు. 2008 డీఏస్సీ అభ్యర్థులకు మినిమం పేస్కేల్ (టైం స్కెల్) ఇచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు ఓకే చెప్పింది. మంగళవారం రాష్ట్ర సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఆ వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

గత పదేండ్ల అవినీతిపై చర్చించినం

పదేండ్లలో జరిగిన అవినీతి, అన్యాయలపై చర్చించినట్లు పొంగులేటి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఇరిగేషన్​పై అసెంబ్లీలో వైట్ పేపర్ పెట్టామని.. అవకతవకలు జరిగాయని జ్యూడిషియరీ ఎంక్వైరీకి ఆదేశించనున్నట్లు గతంలోనే చెప్పినట్లు తెలిపారు. అందులో భాగంగానే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పినాకి చంద్రఘోష్​ను విచారణ కమిటీ చైర్మన్ గా నియమించినట్లు చెప్పారు. ఈ కమిటీ వంద రోజుల్లోనే విచారణ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. విద్యుత్​రంగంపై కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో వైట్​పేపర్ రిలీజ్ చేశారని.. ఆ రంగంలోనూ అక్రమాలు జరిగినట్లు గుర్తించామని పూర్తిస్థాయిలో వివరాలు తెలుసుకునేందుకు జస్టిస్ ఎంఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఇంకో విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెల్లరేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారని.. ప్రజా పాలనలోనూ దీనిపై అప్లికేషన్లు వచ్చాయన్నారు. ఆరోగ్యశ్రీ వంటి వాటి కోసం ఇబ్బందులు లేకుండా రేషన్ కార్డులు త్వరలోనే ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇక ఓఆర్‌‌ఆర్‌‌ చుట్టూ జిల్లాల వారీగా స్వయం సహాయక సంఘాల(ఎస్​హెచ్​జీ) ఉత్పత్తులకు మార్కెటింగ్‌‌ సౌకర్యం కల్పించడంపై మంత్రివర్గం చర్చించినట్లు తెలిపారు. దాదాపు 25 నుంచి 30 ఎకరాల్లో మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు.

గీత కార్మికులకు సేఫ్టి కిట్​

వృత్తిపరమైన కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినేట్​ నిర్ణయం తీసుకున్నదని మంత్రి పొన్న ప్రభాకర్​ తెలిపారు. ఇందులో ముదిరాజ్, యాదవ..కురుమ,  మున్నూరుకాపు, పద్మశాలి, పెరిక (పురగిరి క్షత్రియ), లింగాయత్, మేర, గంగపుత్ర కార్పొరేషన్, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు(ఈబీసీ)ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు, ఆర్య, వైశ్య కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, మాదిగ, మాదిగ ఉపకులాల కార్పొరేషన్, మాల, మాల ఉప కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఎస్టీల కోసం మూడు ప్రత్యేక కార్పొరేషన్లు కుమ్రం భీమ్ ఆదివాసి కార్పొరేషన్, సంత్ సేవాలాల్ లంబాడీ కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్నారు. ఏకలవ్య కార్పొరేషన్  ఏర్పాటుకు కేబినేట్ అప్రూవల్ ఇచ్చిందన్నారు. గీత కార్మికులకు చెట్లపై నుంచి పడితే గాయాలు కాకుండా ప్రత్యేక సేఫ్టీ కిట్​ను అందజేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ మహిళా శక్తిని ఆర్థికంగా చైతన్యం చేయాలని కేబినేట్​లో నిర్ణయించినట్లు మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్​ బాబు చెప్పారు. ఈ విషయమై 15 అంశాలపై కేబినెట్​లో చర్చించినట్లు తెలిపారు. తాగునీటికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని కేబినెట్ ఆదేశించిందని తెలిపారు. కేబినెట్​ ఆమోదం లభించి కొత్తగా ఏర్పాటు చేయున్న కార్పొరేషన్లకు త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తామని చెప్పారు.