
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సెప్టెంబర్ లో స్థానిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు లేఖ రాయనుంది. ఇదే జరిగితే సెప్టెంబర్ లో స్థానిక ఎన్నిల నగారా మోగనుంది.
రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేత
సీఎం రేవంత్ అధ్యక్షతన ఆగస్టు 30న జరిగిన తెలంగాణ కేబినెట్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని నిర్ణయించింది. పంచాయతీ రాజ్ చట్టం2018 సవరణకు ఆమోదం తెలిపిన కేబినెట్.. రిజర్వేషన్ల పరిమితిపై గత ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ప్రత్యేక బిల్లు ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. అసెంబ్లీ తర్వాత ప్రత్యేక జీవో తెచ్చి కులగణన ఆధారంగా తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చూస్తోంది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అజారుద్దీన్
అంతేగాకుండా మరోసారి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ఖరారు చేసింది. ఈ సారి అమీర్ అలీ ఖాన్ ప్లేసులో అజారుద్దీన్ కు అవకాశం కల్పించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున కొత్త అభ్యర్థికి అవకాశం రానుంది.
స్థానిక ఎన్నికలకు ఈసీ రెడీ
రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రభుత్వం నుంచి అందిన సంకేతాలతో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఓటరు జాబితాల సవరణ, తుది జాబితా ప్రచురణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నోటిఫికేషన్ జారీ చేశారు.