31న రాష్ట్ర కేబినెట్ భేటీ... 40 నుంచి 50 అంశాలపై చర్చించే అవకాశం

31న రాష్ట్ర కేబినెట్ భేటీ...  40 నుంచి 50 అంశాలపై చర్చించే అవకాశం

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 31న మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటేరియెట్​లో కేబినెట్ మీటింగ్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దాదాపు 40 నుంచి 50 అంశాల మీద మంత్రి వర్గం చర్చించే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలు, ప్రభుత్వ చర్యలపై కేబినెట్ సమీక్షించనుంది. సాగు రంగంలో తలెత్తిన పరిస్థితులు, వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని మంత్రివర్గం అంచనా వేయనుంది. రోడ్ల మరమ్మతుల కోసం చేపట్టనున్న చర్యలపై కూడా మంత్రులతో సీఎం కేసీఆర్ చర్చిస్తారు. ఆర్టీసీ కార్మికుల వేతనాల పెంపు వంటి తదితర అంశాలపై నిర్ణయం తీసుకోనున్నామని సీఎంవో శుక్రవారం రిలీజ్ చేసిన ప్రకటనలో తెలిపింది. అయితే, కేబినేట్ ఎజెండా అంశాల్లో ప్రధానంగా ఇరిగేషన్​, రెవెన్యూకు సంబంధించినవే ఉన్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.

 పైగా, ఇది ఆఖరి కేబినెట్ మీటింగ్ కావచ్చేమో అనే చర్చ కూడా అధికార వర్గాల్లో జరుగుతున్నది. ఆగస్టులో అసెంబ్లీ నిర్వహించడం.. ఆ తర్వాత సెప్టెంబర్ చివర లోపు ఎలక్షన్స్​కు షెడ్యూల్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అందులో భాగంగానే పెండింగ్​లో ఉన్న ప్రతి ఫైల్​నూ క్లియర్ చేసుకునే పనిలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ఇరిగేషన్​లో వివిధ ప్రాజెక్టులకు పెరిగిన అంచనాలకు కేబినెట్ ఆమోదించడంతో పాటు కొత్త వాటికి పర్మిషన్స్ ఇస్తారని తెలిసింది. అలాగే రెవెన్యూలో భూములకు సంబంధించిన అనేక విషయాలపై టేబుల్ అంశంగా పెట్టి అప్రూవల్స్ ఇవ్వనున్నారు. ఇందులో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వ్యాపారులకు సర్కార్ భూములను అప్పనంగా కట్టబెట్టేలా ప్రపోజల్స్ సిద్ధం చేసినట్లు  సమాచారం.