హైకోర్టు స్టేపై కేబినెట్‌లో చర్చ.!వచ్చే వారం మంత్రివర్గం భేటీ అయ్యే చాన్స్

హైకోర్టు స్టేపై కేబినెట్‌లో చర్చ.!వచ్చే వారం మంత్రివర్గం భేటీ అయ్యే చాన్స్
  • ఆ తర్వాతే జీవో 9పై ఏంచేయాలనేది నిర్ణయించనున్న రాష్ట్ర సర్కారు
  • సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేయడమా? హైకోర్టులోనే కొట్లాడటమా? 
  • అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తున్న ప్రభుత్వం
  • వచ్చేవారం మంత్రివర్గం భేటీ అయ్యే చాన్స్​

హైదరాబాద్, వెలుగు: జీవో 9, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఎదురైన న్యాయపరమైన అడ్డంకులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. బీసీ రిజర్వేషన్ల పెంపు జీవో 9పై హైకోర్టు స్టే విధించడంతో ఏం చేయాలనే దానిపై రాష్ట్ర కేబినెట్‌‌‌‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. వచ్చే వారంలో కేబినెట్‌‌‌‌ సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నది. ఆర్డర్  పూర్తి వివరాలు, దాని ప్రభావం, న్యాయ నిపుణుల సలహాల ఆధారంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నది. స్టే ఆర్డర్​ కాపీ ఇంకా అందకపోవడంతో.. వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో స్టడీ చేసి.. న్యాయ నిపుణుల సలహాలు, సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకోనున్నది. 

ముఖ్యంగా 50 శాతం రిజర్వేషన్ల పరిమితి, పంచాయతీ రాజ్ చట్ట సవరణ 285(ఏ) అంశాలపై ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు అటు మంత్రులు, ఉన్నతాధికారులు, ఏజీ, లాయర్లతో సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి దాటుతూ గతంలో ఇచ్చిన జీవోలను హైకోర్టు, సుప్రీంకోర్టులు కొట్టేశాయి. మొదటిసారి స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లపై హైకోర్టు పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నది.  దీంతో సమగ్ర కుల గణన సర్వే ఎంపిరికల్​ డేటా, డెడికేటెడ్​ కమిషన్ నివేదిక ఇవన్నీ పాజిటివ్‌‌‌‌గానే ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తున్నది. 

అయితే, పంచాయతీరాజ్​ చట్ట సవరణ విషయంలో అలర్ట్‌‌‌‌గా లేకపోవడం, ఈ విషయాన్ని అధికారులు ముందుగానే చెప్పకపోవడంతో సవరణ బిల్లు ఆలస్యమైందని అధికారులపై సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి అసహనంగా ఉన్నారు. ముందే తెలిస్తే.. ఇప్పటికే  నెలలు గడిచిపోయి గవర్నర్​, రాష్ట్రపతి ఆమోదించకున్నా..  సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డీమ్డ్​ టుబీ అప్రూవల్​అయిపోయేదని మంత్రులతో అన్నట్లు తెలిసింది. 50 శాతం పరిమితి దాటడంపై ఎంతవరకైనా వెళ్లాలని, సుప్రీంకోర్టులోనైనా తేల్చుకోవాలని భావిస్తున్నారు. అయితే, స్థానిక ఎన్నికలు ఇప్పటికే ఆలస్యం కావడం, మరింత లేట్‌‌‌‌ అయితే గ్రామాల్లో పాలన పూర్తిగా కుంటుపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.  దీంతో సుప్రీంకోర్టులో స్పెషల్‌‌‌‌ లీవ్ పిటిషన్‌‌‌‌ (ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌పీ)   వేయడమా? లేక హైకోర్టులోనే కొట్లాడటమా? అనే రెండు ప్రధాన అంశాలపై కేబినెట్‌‌‌‌లో లోతుగా చర్చించనున్నారు.  

 న్యాయ నిపుణులతో సంప్రదించి సవాల్​ చేయనున్న ఎస్ఈసీ

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడిన తర్వాత  రాష్ట్ర హైకోర్టు స్టే ఆర్డర్ జారీ చేయడాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌‌‌‌ఈసీ) తీవ్రంగా పరిగణిస్తున్నది.  రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-ఓ (స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి), ఆర్టికల్ 329 (సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి) ప్రకారం.. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, ఫలితాల అనంతరం మాత్రమే ఎన్నికల పిటిషన్ ద్వారా న్యాయస్థానాలు జోక్యం చేసుకునేందుకు పరిమితులు ఉన్నాయి. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా హైకోర్టు స్టే ఇవ్వడం తమ అధికార పరిధిలో జోక్యం చేసుకోవడమేనని ఎస్ఈసీ భావిస్తున్నది.  షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కోర్టులు ఎన్నికల ప్రక్రియను అడ్డుకునే అధికారం లేదని స్పష్టం చేస్తూ, తమ స్వయంప్రతిపత్తిని కాపాడుకోవడానికి హైకోర్టు స్టే ఆర్డర్‌‌‌‌ను సవాల్ చేసేందుకు ఎస్‌‌‌‌ఈసీ సిద్ధమవుతున్నది. దీనిపై హైకోర్టునే ఆశ్రయించడమా? లేదా సుప్రీంకోర్టుకు వెళ్లడమా? అనేది ఆలోచన చేస్తున్నది. కోర్టు స్టే ఆర్డర్​లో పేర్కొన్న అంశాలకు తగ్గట్టుగానే ముందుకు వెళ్లనున్నట్టు తెలుస్తున్నది.