- తొలిసారి హైదరాబాద్ బయట కేబినెట్ మీటింగ్
- మేడారం జాతర, మున్సిపల్ ఎన్నికలు, వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, సాగునీటి ప్రాజెక్టులపై చర్చ
హైదరాబాద్, వెలుగు: పాలనా చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి రాష్ట్ర సర్కార్ తెరలేపింది. ఎప్పుడూ హైదరాబాద్ లోని సచివాలయం లేదా అసెంబ్లీ కమిటీ హాల్ జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని, తొలిసారిగా రాజధాని నగరానికి వెలుపల నిర్వహించేందుకు సిద్ధమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతికెక్కిన ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ సన్నిధిలో ఆదివారం కేబినెట్ సమావేశం జరగనుంది. మేడారంలోని హరిత హోటల్ ఈ చారిత్రక సమావేశానికి వేదిక కానుంది.
సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సహచరులందరూ సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ వెలుపల, అందులోనూ ఒక మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో కేబినెట్ భేటీ జరుగుతుండటం ఇదే తొలిసారి కావడం విశేషం.
యాసంగి రైతు భరోసాపై క్లారిటీ వచ్చే చాన్స్
కేబినెట్ భేటీలో ప్రధానంగా మేడారం మహా జాతర ఏర్పాట్లపైనే చర్చించనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో వచ్చే ఏడాది జరగనున్న గోదావరి నదీ పుష్కరాల నిర్వహణపైనా మంత్రివర్గం దృష్టి సారించనుంది. అలాగే 2028లో కృష్ణా పుష్కరాలు కూడా రానున్నాయి. అందుకే భవిష్యత్తులో జరగబోయే పుష్కరాలకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు, ఘాట్ల నిర్మాణం, నిధుల సమీకరణ వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
మేడారం జాతర, పుష్కరాలకు వచ్చే భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, నిధుల కేటాయింపు, శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. వీటితో పాటు త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల సన్నద్ధత, మున్సిపాలిటీల్లో కో ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్ జెండర్లను నామినేట్ చేయడంపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. యాసంగి రైతు భరోసా అమలుపై కూడా చర్చ జరిగే అవకాశం ఉండటంతో, ఈ సమావేశంలో దీనిపై క్లారిటీ రానుంది.
గిరిజనుల భూ సమస్యలు, పోడు భూముల పట్టాల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలిసింది. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాగా, సీఎం సహా మంత్రులందరూ ఒకేసారి మేడారం వస్తుండటంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీకి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.
