వెలుగు ఓపెన్ పేజీ.. చర్చ కులం సంఖ్యమీద కాదు.. అభివృద్ధి, అధికారంలో వాటామీద జరగాలి

వెలుగు ఓపెన్ పేజీ.. చర్చ కులం సంఖ్యమీద కాదు.. అభివృద్ధి, అధికారంలో వాటామీద జరగాలి

తెలంగాణ  ప్రభుత్వం  ఏప్రిల్​ 15,  2026న  242 కులాల సంఖ్య,  దానితోపాటు ఇండిపెండెంట్​ ఎక్స్ పర్ట్​  గ్రూపు ప్రతి కులానికి శాస్త్రీయంగా రూపొందించిన కంపోజిట్​బ్యాక్​వర్డ్​నెస్​  ఇండెక్స్​ (సీబీఐ)  స్కోరు  విడుదల చేశాక  ప్రతికులంలోనూ చర్చ జరుగుతున్నది. ఈ చర్చ  ప్రధానంగా చాలా పైపైన ఏ కులం సంఖ్య ఎంత ఉంది అనే అంశం చుట్టూ తిరుగుతున్నది.  

ఎక్స్​పర్ట్​  గ్రూప్​  వైస్​  ప్రెసిడెంట్​గా పనిచేసిన నన్ను కూడా  చాలామంది  కలిసి మా కులం సంఖ్య గింత తక్కువనా  అనే ప్రశ్న మాత్రమే అడుగుతున్నారు.  కానీ,  మా కులం గింత వెనుకబడి ఉన్నదా,  దాని అభివృద్ధికి ఏం చేయాలి అనే ప్రశ్న అడుగుతలేరు. ఈ ప్రశ్న అన్ని కులాల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న మాదిగ మేధావులు,  కార్యకర్తల దగ్గరి నుంచి, అన్ని బీసీ కులాల వరకు అడుగుతున్నారు.

ఈ ప్రశ్న అడగటంలో ఒక భ్రమ ఉన్నది.  సంఖ్య చాలా ఎక్కువగా తేలితే వెంటనే అన్ని స్థాయిల్లో రాజకీయ, సాంఘిక,  ఆధ్యాత్మిక అధికారం  తమ  కులంవారికి వస్తుంది అనే  భ్రమ.  కులం సంఖ్య చుట్టూ ఆ కుల నాయకులు, మేధావుల చైతన్యాన్ని తిప్పడంలో ఒక ప్రమాదమున్నది. ఆ కులం అభివృద్ధి కాకుండా అణగదొక్కే శక్తుల గురించి కాకుండా ఉంచడం. 

ఆ కులంలోని నాయకులే  ఆ కులాన్ని విద్య, ఉద్యోగం, రాజకీయ రంగంలో అభివృద్ధి చెందకుండా ఉంచడం కోసం కూడా  అది పనికొస్తుంది. ఇది ప్రమాదకరం.   దేశ చరిత్రలోనే  మొదటిసారిగా  తెలంగాణలో అన్ని కులాల లెక్క ఒకటి బయటికొచ్చింది.  ఇది తప్పో  రైటో  రేపు 2027లో  జాతీయ కులగణనతో మళ్లీ ప్రతి కులం లెక్క  మరోసారి బయటికొస్తుంది.   

అప్పుడు పోల్చి చూసుకోవచ్చు. అంతకుమించి  మరో లెక్కలేదు.  కానీ, రేపు  జాతీయ కుల లెక్కలు వచ్చాక కూడా ఏ కులం ఎంత అభివృద్ధి చెందిందో 42 అంశాల ద్వారా ప్రతికుల అభివృద్ధిని మరో మేధావి టీమ్​తో  అధ్యయనం చేయించడానికి  అసలే  ఆస్కారం ఉండదు. ఎందుకంటే  2027  లెక్కలలో  కులం సంఖ్య  మాత్రమే  తెలుసుకునే  కాలమ్​ ఉంటుంది కనుక.  అది తెలంగాణ ప్రభుత్వం  జరిపించిన  సామాజిక,  ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల సర్వేలా కాదు.  కేంద్ర సర్వేలో  ఏ కులం చదువెంత,  ఏ  కులం దగ్గర ఎన్ని ఉద్యోగాలున్నాయి,  ఏ కులం దగ్గర  ఎంత భూమి ఉన్నది,  ఎన్ని కార్లు ఉన్నాయి అనే  అంశాలు  ఆ సర్వే  ప్రశ్నావళిలో ఉండవు.  

అందువల్ల  ఇప్పుడు  బయటికొచ్చిన  ప్రతి కులం  సీబీఐ స్కోరు చాలా సంవత్సరాలు ఆయా కుల స్థితిని అంచనా వేయడానికి  ఆధారభూతం అవుతుంది.  అందుకని  ప్రతికులంలో  విద్యావంతులు,  నాయకులు, ఆయా కుల అభివృద్ధికి  బారోమీటర్​గా  ఉన్న సీబీఐ  స్కోరు వివిధ రంగాలలో  చేసుకుంటే  చాలా మార్పులకు అవకాశం ఉంటుంది.   

కులం సంఖ్య చాలా పెద్దగా ఉంటే  పదవులు, ఆస్తులు, చదువు వస్తాయనుకుంటే ఒక ఊళ్లో  సగానికి మించి జనాభా ఉన్న  బీసీ ఒక్క కులం  లేదా  ఎస్సీ ఒక్క కులం ఉన్నది  మనకు తెలుసు.  ఆ ఊరు అధికారమంతా ఎక్కువ  కులస్తులకు  వందల ఏండ్ల  నుంచి రాలేదు.  ఒక్క  కుటుంబంగా అగ్రకుల భూస్వామి, లేదా పోలీస్​పటేల్,  లేదా పట్వారీ పెత్తనం చలాయించాడు.  రాష్ట్రంలో కూడా అంతేకదా. 0.4 శాతం వెలమ కులస్తులు 15 ఏండ్లు  ముఖ్యమంత్రులుగా పనిచేశారు. (జలగం వెంగళరావు, చంద్రశేఖర్ రావు).  36 లక్షలకు పైగా ఉన్న మాదిగలు ఇప్పటివరకు ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలేదే.  ఎందుకు?  ఆ పదవిని అందుకోవడానికి కావాల్సిన ఆర్థిక, రాజకీయ ఇతర హంగులు ఆ కులం దగ్గరికి  ఇంకా  చేరలేదు  కనుక. 

రాజకీయ అధికారం

 ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 50 శాతానికి పైగా  ఒక బీసీ కులమో, ఎస్సీ కులమో ఉన్నా అక్కడ ఆ కులపు అభ్యర్థి  ఎంఎల్ఏగా  గెలవడం లేదు.  ఇప్పటివరకు 
తెలంగాణలో  విద్య,  ఆర్థిక  అభివృద్ధిలో వెనుకబడి ఉన్న బీసీ, ఎస్సీ కులాల సంఖ్యరీత్యా ఎంత బలంగా ఉన్నా రాజకీయ అధికారం, వ్యవస్థను నడిపే సత్తా  ఏ ఒక్క కులానికి రాలేదు.  

ఇక్కడే ఈ కులాలు ఒక దీర్ఘకాలిక  ప్రణాళికతో  సీబీఐ స్కోరును  అధ్యయనం చేసి ఆయా కులాల  విద్య, వ్యాపారం, ఉద్యోగం (సివిల్​ సర్వీస్​ ఉద్యోగాలతో సహా)  మొబిలిటీ వంటి  ఇండికేటర్లను  బాగా  పెంచుకుంటూ పోవాలి.  సంఖ్య  కేంద్రీకృత చర్చ అధికారంలో  వాటా లేని కులాల మధ్య  తగాదాకు  
దారితీస్తుందే కాని అధికారంలోకి  ఈ కులాలు రావడానికి దోహదపడదు.  

వెనుకబడిన కులాలకు రోజువారీ బతుకుదెరువు  గ్రామీణ ప్రాంతాల్లో సమస్య అయినప్పుడు  వారి ఓట్లు కూడా అక్కడి ఆధిపత్య కులశక్తి  ఏది ఉంటే దాని చేతిలో ఉంటాయి. మంచి ప్రభుత్వ స్కూలు విద్య భవిష్యత్​  తరాలను అభివృద్ధి మార్గంలో పెడతాయి. అదీ ఇంగ్లిష్ మీడియం విద్య ద్వారానే  ఈ కులాల  పిల్లలు  పోటీలో  నిలబడగలుగుతారు.

వెల్ఫేర్​ స్కీములపై ఆధారపడి బతుకుకమిటీ ఇచ్చిన సీబీఐ స్కోరులో వెల్ఫేర్​ స్కీములు ఏ కులాలకు ఎంత ఆధారభూతంగా ఉన్నాయో  కమిటీ రిపోర్టు స్పష్టంగా తేల్చిందేమంటే  ఒక్క రైతుబంధు ద్వారా చాలా కులాల్లోకి పోయే డబ్బులో ఒక కీలక భాగం అభివృద్ధి చెందిన అగ్ర కులాలకు పోతున్నది.  మిగతా  వెల్ఫేర్​ స్కీములు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు  ఆధారంగా ఉన్నాయి.  

అవి లేకపోతే చాలా కులాల్లో  బీదలు  బతకలేని స్థితిలో ఉన్నారు.  భవిష్యత్తులో  ఈ  కులాల నుంచి చదువుకున్న  యువత  ఎదిగితే  క్రమంగా కులంలో మార్పు వస్తుంది.   ఇటువంటి వెనుకడిన కులాల్లో ఎదిగిన నాయకత్వం తమ కుటుంబంతోపాటు  కులం  బాగోగులు  గురించి  పట్టించుకున్నప్పుడే  ఆ కులం మొత్తం ఎదగడం ప్రారంభిస్తుంది.  ఈ క్రమంలోనే   బీసీ, ఎస్సీ,  ఎస్టీ  కులాల నుంచి బలమైన రాజకీయ నాయకత్వం ఎదుగుతుంది.  

సీబీఐ స్కోర్​ బలమేంది?

తెలంగాణ జనాభాలో 42 ప్యారామీటర్ల ఆధారంగా రూపొందించిన  సీబీఐ స్కోర్​ 0 నుంచి పైకి నంబర్లలో  కులాల విద్య, ఆర్థిక, సాంఘిక, స్ర్తీ–పురుష రాజకీయ స్థితిని అంచనా వేసింది.  తక్కువ  నంబర్​ ఉంటే ఎక్కువ అభివృద్ధిలో ఉన్నట్టు,  ఎక్కువ నంబర్​ ఉంటే తక్కువ అభివృద్ధి, ఎక్కువ  వెనుకబాటుతనం ఉన్నట్టు.   గ్రామస్థాయి  కులాల రింగ్​లీడర్లు సైతం ఈ స్కోరును జాగ్రత్తగా అధ్యయనం చేసి తమ కుల ప్రజలతో  సమావేశాలు జరుపుకోవాలి.   

కుల సంఖ్య తక్కువ  ఎక్కువ కంటే దాని అభివృద్ధి స్కోరును  మార్చుకునే ఐక్య  కార్యక్రమాలను రూపొందించుకుని  ప్రభుత్వంపైన, రాజకీయ పార్టీలపై డిమాండ్లను  రూపొందించుకోవాలి. పార్టీలపై  నాయకులు కింది కులాల యువకులు  ఇటువంటి లోతైన  మార్పుకు  పూనుకోవడాన్ని వ్యతిరేకిస్తారు.  వారు  తమ అధికారాన్ని,  ధనార్జనను  నిరంతరంగా కాపాడుకోవడానికి  ఈ లెక్కల ద్వారా వచ్చే చైతన్యం  ప్రమాదకరమని భావిస్తారు.  అది సహజం.  

ఎవ్వరూ కూడా  వ్యక్తి,  కుటుంబ, కుల అధికారాన్ని   మరో వ్యక్తి,  మరో కుటుంబం,  మరో కులం  తీసుకోవడాన్ని  భరించలేరు.  అది  మానవ  సహజ లక్షణం.  కానీ, ఈ  కులగణన  ద్వారా  జరిగిన  అధ్యయనం  అద్దంలో  అన్ని  కులాల  నంబర్​ బలాన్ని  మాత్రమే కాకుండా  దాని అంతర్గత బలహీనతను చూపెడుతుంది.  అందుకే  ఈ సర్వేను  ఎక్స్​రే  అని అభివర్ణించారు. ఎక్స్​రేలో  ఏ రోగముందో  బయటపడుతుంది.  ఆ రోగాన్ని నయం చేసుకోవడం వల్ల వ్యక్తి,  కుటుంబ, కుల జీవితం ఆరోగ్యవంతం అవుతుంది.  కులాల నంబర్​ మాత్రమే తేల్చడాన్ని  ఎక్స్​రే  అనం.  అది  సంఖ్య మాత్రమే. 

అన్ని కులాల్లో వ్యాపారులు ఎదగడం..

వందల ఏండ్లుగా వెనుకబడిన కులాలు చాలా రంగాల్లో ప్రవేశం లేకుండా ఉన్నాయి.  విద్య,  వ్యాపారం,  బ్ర్యూరోక్రటిక్​ అధికారం, రాజకీయ అధికారం చాలా కులాలకు దూరం చేసిన ఆధ్యాత్మిక,  సాంఘిక వ్యవస్థ ఇప్పుడు  రాష్ట్రంలో బయటకొచ్చిన 242 కులాల స్థితిని  మొదటిసారి అద్దంలో చూపించింది.  సమాజం  పశుపోషణ నుంచి వ్యవసాయానికి దాని నుంచి క్రమంగా పెట్టుబడిదారి వ్యాపారరంగంలోకి మారుతూ ఉన్న  ఈ దశలో అన్ని కులాలు ఈ మార్పు దారుల్లో  పయనించడం అవసరం.  ఇది విద్యతోపాటు యువకులు వ్యాపార రంగాల్లో చొరబడాలి.  

బీసీ, ఎస్సీలకు వ్యాపార రంగాలపైన  అస్సలు ఆసక్తి లేదు.  చదువు మీద ఆసక్తి అంతంతే. కానీ, రాజకీయ అధికారం కావాలని రోజు తిరుగుతుంటారు. కానీ, రాజకీయ అధికారం ఆట్ల రాదు. వస్తే కూడా అది వీరి చేతిలో ఉండది.  వ్యాపార రంగం రోజుకు 14–15 గంటలు సమయాన్ని కోరుకుంటుంది.  దినసరి  క్యాలిక్యులేషన్​పై ఫోకస్​ పెట్టాలి.  అందుకే  బీసీ, ఎస్సీ యూత్​ అందులో  అడుగు పెట్టడానికి ఇష్టపడడం లేదు.  కానీ అదే  ధనాన్ని పోగుచేయగల శక్తిగల  రంగం.

- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్​

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.