అవ‌‌స‌‌రాల‌‌కు తగ్గట్టు కొత్త బ‌‌స్సులు కొనండి : సీఎం రేవంత్​రెడ్డి

అవ‌‌స‌‌రాల‌‌కు తగ్గట్టు కొత్త బ‌‌స్సులు కొనండి : సీఎం రేవంత్​రెడ్డి
  • ఆర్టీసీపై అప్పుల భారం త‌‌గ్గించే ప్రయత్నం చేయండి : సీఎం రేవంత్​

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా  ప్రజల అవ‌‌‌‌స‌‌రాల‌‌కు తగ్గట్టుగా కొత్త బ‌‌స్సులను కొనేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆర్టీసీ అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. పెరిగిన అవ‌‌స‌‌రాలు, కొత్త మార్గాల‌‌ను ఇందుకు ప్రాతిపదికగా తీసుకోవాల‌‌ని సూచించారు. మంగళవారం సెక్రటేరియట్ లో టీజీఎస్​ ఆర్టీసీపై  సీఎం రేవంత్ రెడ్డి  స‌‌మీక్ష నిర్వహించారు. మ‌‌హాల‌‌క్ష్మి స్కీమ్​ను మ‌‌హిళ‌‌లు ఎలా వినియోగించుకుంటున్నారని ఆరా తీశారు. ఈ ప‌‌థ‌‌కం అద్భుతంగా ఉంద‌‌ని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వ‌‌ర‌‌కు 83.42 కోట్ల మంది మ‌‌హిళ‌‌లు  ఉచితంగా ప్రయాణం చేశార‌‌ని సీఎంకు  రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.

ఈ స్కీమ్​ ద్వారా మ‌‌హిళా ప్రయాణికుల‌‌కు రూ.2,840.71 కోట్లు ఆదా అయ్యాయ‌‌ని  చెప్పారు.  ఆర్టీసీలోని 7,292 బ‌‌స్సుల్లో మ‌‌హాల‌‌క్ష్మి ప‌‌థ‌‌కం అమలవుతున్నదని, ఈ ప‌‌థ‌‌కం ప్రారంభ‌‌మైన త‌‌ర్వాత వివిధ జిల్లాల నుంచి హైద‌‌రాబాద్‌‌లోని ఆసుప‌‌త్రుల‌‌కు వ‌‌స్తున్న మ‌‌హిళ‌‌ల సంఖ్య పెరుగుతున్నదని  పొన్నం వివరించారు. దీనికి  సంబంధించి ప‌‌త్రిక‌‌ల్లో వ‌‌చ్చిన వార్తలను ముఖ్యమంత్రికి అధికారులు ప‌‌వ‌‌ర్‌‌పాయింట్ ప్రజెంటేషన్​ ద్వారా వివరించారు.  

మ‌‌హాల‌‌క్ష్మి ప‌‌థ‌‌కంతో ఆక్యుపెన్సీ రేటు పెర‌‌గ‌‌డంతోపాటు ప్రభుత్వం చెల్లిస్తున్న రీయింబ‌‌ర్స్‌‌మెంట్‌‌తో సంస్థ లాభాల్లోకి వ‌‌స్తున్నదని అధికారులు తెలిపారు. వివిధ బ్యాంకులు, ఉద్యోగుల భ‌‌విష్యత్ నిధి ఖాతా నుంచి వాడుకున్న నిధులు, విశ్రాంత ఉద్యోగుల‌‌కు చెల్లించాల్సిన బ‌‌కాయిలు, ఇతర బకాయిలు క‌‌లిపి మొత్తం రూ.6,322 కోట్ల రుణాలు ఉన్నట్టు వెల్లడించారు.

సంస్థపై రుణభారం తగ్గించండి : రేవంత్​

బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల‌‌కు చెల్లిస్తున్న వ‌‌డ్డీ రేటు ఎక్కువ‌‌గా ఉంద‌‌ని, వీటి త‌‌గ్గింపు, అప్పుల రీక‌‌న్‌‌స్ట్రక్షన్​పై అధ్యయ‌‌నం చేయాల‌‌ని అధికారులను సీఎం రేవంత్​ ఆదేశించారు. సంస్థపై క్రమంగా రుణ‌‌భారం త‌‌గ్గించాల‌‌ని ఆయ‌‌న సూచించారు.  స‌‌మీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌‌ర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి కార్యద‌‌ర్శులు చంద్రశేఖ‌‌ర్‌‌రెడ్డి, షాన‌‌వాజ్ ఖాసీం, ర‌‌వాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద‌‌ర్శి వికాస్ రాజ్‌‌, టీజీఎస్ ఆర్టీసీ ఎండీ స‌‌జ్జనార్, ఇత‌‌ర అధికారులు పాల్గొన్నారు.