
హైదరాబాద్, వెలుగు: సివిల్ సప్లైస్ శాఖ ఆదాయం పెంచుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాకు ఒకటి చొప్పున పెట్రోల్ బంక్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లాల్లో పెట్రోల్ బంక్‌లకు అనువైన ల్యాండ్‌ను గుర్తించి, ఆయా ఆయిల్ కంపెనీలకు బంక్‌లు కేటాయించడానికి ఐదుగురు అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఫైనాన్స్, మార్కెటింగ్, ప్రొక్యూర్‌మెంట్ జనరల్ మేనేజర్లు, ఫైనాన్స్ డీజీఎం, డీఎంలను సభ్యులుగా నియమించింది.
ఇప్పటికే పలుమార్లు సమావేశమైన కమిటీ ఈ మేరకు తొలివిడతలో కరీంనగర్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ఐఓసీ, కొత్తగూడెం, మేడ్చల్, ఖమ్మం జిల్లాల్లో హెచ్‌పీసీఎల్, జగిత్యాల, మెదక్ జిల్లాల్లో బీపీసీఎల్ బంక్‌లను ఏర్పాటు చేసింది. రెండో విడతలో 8 జిల్లాల్లో బంక్ ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు వరంగల్, వనపర్తి, సూర్యపేట, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, సిద్ధిపేట, హనుమకొండ, జనగామ జిల్లాల్లో పెట్రోల్ బంక్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు సివిల్ సప్లైస్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ తెలిపారు.