స్పోర్ట్స్ కోటా పంచాయతీ సెక్రటరీ పోస్టులకు లైన్ క్లియర్!

స్పోర్ట్స్ కోటా పంచాయతీ సెక్రటరీ పోస్టులకు లైన్ క్లియర్!
  •     కమిషనర్ ఆఫీస్ నుంచి జిల్లాలకు చేరిన లిస్టులు
  •     మొత్తం 172 ఖాళీల భర్తీకి భర్తీకి గ్రీన్ సిగ్నల్
  •     నియామక ఉత్తర్వులివ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు, తుది లిస్ట్‌‌ రిలీజ్‌‌ చేసిన పీఆర్ కమిషనర్

హైదరాబాద్, వెలుగు: స్పోర్ట్స్ కోటాలో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న నియామక ప్రక్రియకు  ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది.  స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (ఎస్​ఏటీజీ) ధ్రువీకరించిన మెరిట్ జాబితాలను పంచాయతీరాజ్ కమిషనర్ డి. దివ్య బుధవారం ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించారు. 

అర్హులైన వారికి వెంటనే నియామక ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. గతంలో స్పోర్ట్స్ కోటా కింద నియమితులైన 98 మంది జేపీఎస్‌‌‌‌‌‌‌‌ల నియామకాలను హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం రద్దు చేసింది. వారిని టర్మినేట్ చేసిన అనంతరం మిగిలిన ఖాళీలు, రద్దయిన పోస్టులు కలిపి మొత్తం 172 జేపీఎస్ పోస్టుల భర్తీకి 2021లో కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి 2021 డిసెంబర్ 19న రాత పరీక్ష నిర్వహించారు. అయితే, మళ్లీ కోర్టు కేసులు రావడంతో ఫలితాల వెల్లడి, నియామకాల్లో తీవ్ర జాప్యం జరిగింది.

కోర్టు ఆదేశాలతో కదలిక..

టర్మినేట్ అయిన 98 మందిని, కొత్తగా పరీక్ష రాసిన వారిని పరిగణనలోకి తీసుకుని.. ఖాళీగా ఉన్న 172 పోస్టులను క్రీడా కోటా నిబంధనల ప్రకారం భర్తీ చేయాలని 2023 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు 2025 నవంబర్‌‌‌‌‌‌‌‌లో రాత పరీక్ష ఫలితాలను ప్రకటించారు. అనంతరం గత డిసెంబర్ 29, 30 తేదీల్లో అభ్యర్థుల సర్టిఫికెట్లను స్పోర్ట్స్ అథారిటీ అధికారులు పరిశీలించారు. 

క్రీడాకారులు సమర్పించిన ఫామ్-1, 2, 3, 4 సర్టిఫికెట్లను సాట్స్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి ప్రయారిటీ అప్లికేబుల్, నాట్ అప్లికేబుల్ జాబితాలను రూపొందించింది. సాట్స్ ఎండీ నుంచి వచ్చిన ఈ జాబితాలను పీఆర్ కమిషనర్ కార్యాలయం బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఫార్వార్డ్ చేశారు.  

జిల్లాలో ఉన్న ఖాళీలకు అనుగుణంగా జాబితాలోని మెరిట్ అభ్యర్థులకు కలెక్టర్లు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు. అర్హులతోపాటు తిరస్కరించినవారి జాబితానూ ఆఫీసర్లు విడుదల చేశారు. ఇందులో చాలా మంది జీవోలో లేని క్రీడలకు సంబంధించిన సర్టిఫికెట్లు పెట్టడం, నోటిఫికేషన్ తర్వాత వచ్చిన సర్టిఫికెట్లు సమర్పించడం వంటి కారణాలతో అనర్హులయ్యారు. టెన్నిస్ బాల్ క్రికెట్, కిక్ బాక్సింగ్ వంటి క్రీడలు జీవో పరిధిలో లేనందున వారిని పరిగణనలోకి తీసుకోలేదు.

ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు

పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లడంతో గురు, శుక్రవారాల్లోనే ఆయా జిల్లాల కలెక్టర్లు అభ్యర్థులకు అపాయింట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంది. హాకీ, కబడ్డీ, అథ్లెటిక్స్, వాలీబాల్ తదితర క్రీడల్లో జాతీయ, సౌత్ జోన్ యూనివర్సిటీ స్థాయిల్లో రాణించిన వారికి ఈ జాబితాలో చోటు దక్కింది.

మొత్తం172 పోస్టులు భర్తీ 

రాష్ట్రంలో మొత్తం 172 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో  ఆదిలాబాద్- 6, భద్రాద్రి కొత్తగూడెం- 7, జగిత్యాల- 5, జనగాం- 4, జయశంకర్ భూపాలపల్లి, ములుగు- 6, జోగుళాంబ గద్వాల్‌‌‌‌‌‌‌‌- 3, కామారెడ్డి- 8, కరీంనగర్- 4, ఖమ్మం- 9, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్- 4, మహబూబాబాద్- 7, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్, నారాయణపేట- 10, మంచిర్యాల- 4, మెదక్- 6, నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్- 6, నల్గొండ- 13, నిర్మల్- 6, నిజామాబాద్- 8, పెద్దపల్లి- 3, రాజన్న సిరిసిల్ల- 3, రంగారెడ్డి- 7, సంగారెడ్డి- 8, సిద్దిపేట- 6, సూర్యపేట- 6, వికారాబాద్- 8, వనపర్తి- 3, వరంగల్ రూరల్- 5, వరంగల్ అర్బన్- 1, యాదాద్రి భువనగిరి- 6 పోస్టులు ఉన్నాయి. కోర్ట్ పెండింగ్లో ఉన్న స్పోర్ట్స్ కోట జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఫైల్‌‌ను మంత్రి సీతక్క చొరవ తీసుకొని క్లియర్ చేపించారని.. ఆమెకు నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ ఫెడరేషన్ పేర్కొంది.