ఆ జర్నలిస్టులకు జాగలియ్యం... పాలు పోసి పామును పెంచలేం కదా

ఆ జర్నలిస్టులకు జాగలియ్యం... పాలు పోసి పామును పెంచలేం కదా

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కేసీఆర్​ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్ల స్థలాలు ఇచ్చే అంశం లాస్ట్​దశలో ఉందని, ఇచ్చే ప్రయత్నం చేస్తామని అంటూనే.. ‘‘కొన్ని పేపర్లు మామీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నయ్​.. ఆ విలేకర్లకు మాత్రం ఇవ్వం.. న్యూట్రల్​గా ఉండే మిగతా అందరికీ ఇస్తం.. రోజూ ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రగతి మీద విషం చిమ్ముతున్నరో ఆ విలేకర్లకు మాత్రం ఇయ్యం.. ఇట్​ఈజ్​ఏ అవర్​డెసిషన్.. గవర్నమెంట్ ​డెసిషన్​.. పొద్దున లేస్తే మాకు వ్యతిరేక వార్తలు.. మాకు అంటే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రగతికి విఘాతం కలిగించే శక్తులకు ఎందుకిస్తం.. పాలు పోసి పామును పెంచలేం కదా..” అని కామెంట్స్​ చేశారు. 

మీడియా సంస్థల నిర్ణయం మేరకు జర్నలిస్టులు పని చేస్తారు కదా అని ప్రశ్నించగా.. ‘‘జర్నలిస్టులకు కూడా ఉండాలి కదా ఐడియా.. కీలుబొమ్మలాగ ఉన్నోడు జర్నలిస్టు ఐతడా.. సోయి ఉండాలే కదా.. ఆమాత్రం జ్ఞానం విజ్ఞానం ఉండాలే కదా.. ఇండియాలో మాతో పోల్చుకోవడానికి కూడా భయపడే రాష్ట్రాలున్నయ్​. అలాంటిది ఇక్కడ జీతాలు పడుతలేవని రాస్తరా? ఒక్కటే దెబ్బలో మొన్న 20 వేల కోట్లు రుణమాఫీ చేసినం .. ఆ పేపర్​తలకాయ ఎక్కడ పెట్టుకోవాలె.. అదో పేపరా.. దానికో వ్యాల్యూ ఉందా.. ఏమనుకోవాలే.. అర్థముండాలె.. ద బెస్ట్​ స్టేట్​ఇన్​ఇండియా, ద బెస్ట్ ​గ్రోత్ ​ఇన్ ​ఇండియా అని ఆర్బీఐ రిపోర్టు ఇచ్చింది.

నీతి ఆయోగ్ ​రిపోర్టు ఇచ్చింది.. పార్లమెంట్​లో కేంద్ర మంత్రులు లిఖిత పూర్వక సమాధానమిచ్చిన్రు... అయినా కూడా మేం ఒకటే రొడ్డ కొట్టుడు కొడుతం.. మా ఇష్టం ఉన్నట్టు రాస్తమంటే అదేం పేపర్​.. దిక్కు మాలిన పేపర్​.. జర్నలిజం ఇదా.. నేను గతంలనే చెప్పిన, ఉద్యమం జరిగినప్పుడే చెప్పిన.. కొన్ని కుల పత్రికలున్నయ్​.. కొన్ని గుల పత్రికలున్నయ్​.. న్యూస్​పేపర్లు, చానళ్లు ఉంటే పర్లేదు.. వ్యూస్​పేపర్లు, వ్యూస్​ చానెళ్లు ఉంటే ఎట్లా..” అని కేసీఆర్​ వ్యాఖ్యానించారు.