
తెలంగాణ రాష్ట్రంలో కుల గణన, సర్వేపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశం తర్వాత.. మీడియాతో చిట్ చాట్ చేశారు రేవంత్ రెడ్డి. ఈ సమయంలో కొన్ని అంశాలపై స్పందించారు.
>>> కుల గణనలో ఒక్క తప్పు ఉన్నా చూపించండి అంటూ సవాల్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కొక్క ఎన్యుమరేటర్ కు 150 ఇళ్లు కేటాయించాం.. జనం స్వయంగా చెప్పిన వివరాలనే రికార్డుల్లో నమోదయ్యాయి అని వివరించారు.
>>> కేసీఆర్ కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వేలో 4 కేటగిరీలు మాత్రమే ఉంటే.. అందులో బీసీలు 51 శాతం, ఎస్సీలు 18 శాతం, ఎస్టీలు 10 శాతం, మిగతావాళ్ళు ఓసీలుగా చూపించారు. అదే మా సర్వే మొత్తం 5 కేటగిరీలు ఉందని.. ముస్లింలలో ఉన్న బీసీలను కూడా కలిపి చెప్పినట్లు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ లెక్క ప్రకారం హిందూ, ముస్లిం బీసీలంతా కలిసి 56 శాతం అయ్యారని వివరించారాయన.
>>> 42 శాతం బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి.. పార్లమెంట్ ఆమోదానికి పంపిస్తామని.. కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయ జోక్యానికి తావులేకుండా కమిషన్ ద్వారానే ప్రాసెస్ చేస్తున్నట్లు వివరించారు సీఎం రేవంత్.
>>> కేసీఆర్ సర్వేలో ఎస్సీలు 82 కులాలుగా చూపించారని.. వాస్తవంగా ఉన్నవి 59 కులాలే అని.. స్పెల్లింగ్ తప్పుగా ఎంట్రీ అయినా దాన్ని మరో కులంగా చూపించారని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
>>> ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి విమర్శలు చేసిన నేను పట్టించుకోను.. రాహుల్ గాంధీ చెప్పిన మేరకే కులగణన సహా అన్నీ చేస్తున్నట్లు మీడియా చిట్ చాట్ లో వెల్లడించారు.
>>> ప్రధాని మోడీ విషయంలో ఎటువంటి తప్పుడు కామెంట్ చేయలేదని.. ఆయన హోదాను తగ్గించి లేదా అగౌరవపరిచినట్లు మాట్లాడలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
>>> ప్రధాని మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అన్నాను.. కేంద్ర మంత్రి, ఆ పార్టీ నేత కిషన్ రెడ్డి కూడా అదే మాట చెప్పారు. కాకపోతే ఎప్పుడు బీసీగా మారారు అన్న తేదీ సమయం విషయంలోనే తేడా ఉండొచ్చన్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన తేదీనే నేను అంగీకరిస్తున్నానని.. మోదీ లీగల్లీ కన్వెర్టెడ్ బీసీ అనేది బీజేపీ కూడా ఒప్పుకున్న విషయాన్ని గమనించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.