
హైదరాబాద్, వెలుగు: రాహుల్‌గాంధీ తలపెట్టిన భారత్ జోడో ‘న్యాయ్’యాత్రకు రాష్ట్రం నుంచి కీలక నేతలు హాజరు కానున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్‌రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ న్యాయ్ యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.
ఇప్పటికే ఆయా నేతలంతా ఢిల్లీకి వెళ్లారు. అక్కడి నుంచి ఆదివారం ఉదయం మణిపూర్‌కు వెళ్లనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో మణిపూర్‌కు చేరుకుంటారు. రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలూ వెళ్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. షర్మిల కూడా న్యాయ్‌యాత్రలో పాల్గొననున్నారు.
భారత్‌జోడో యాత్రకు కొనసాగింపుగా రెండో విడతలో ‘న్యాయ్’యాత్ర పేరుతో రాహుల్ పాదయాత్రను చేయనున్నారు. అల్లర్లతో అట్టుడికిన మణిపూర్ నుంచే రెండో విడత యాత్రను ప్రారంభించాలని డిసైడ్అయ్యారు. ఆదివారం ఇంఫాల్ నుంచి మొదలుపెట్టి మహారాష్ట్ర రాజధాని ముంబైతో యాత్రను ముగించనున్నారు. రాహుల్ 6,700 కిలోమీటర్లకుపైగా పాదయాత్ర, బస్సు యాత్రలు చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.