ఎనిమిది మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా

ఎనిమిది మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా

రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఎనిమిది లోక్‌సభ స్థానాలకు శుక్రవారం రాత్రి అభ్యర్థులను ప్రకటించింది. మిగతా తొమ్మిదింటిని కూడా శనివారం ప్రకటించే అవకాశమున్నట్టు సమాచారం. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి మల్కాజ్రి నుంచి పోటీ చేస్తున్నారు. మరో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌ నుంచి బరిలో దిగుతున్నారు. ఆదిలాబాద్‌ నుంచి రాథోడ్‌ రమేశ్‌, మహబూబాబాద్‌ నుంచి బలరాం నాయక్‌, పెద్దపల్లి నుంచి ఎ.చంద్రశేఖర్‌, జహీరాబాద్‌ నుంచి మదన్‌మోహన్‌, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మెదక్‌ నుంచి గాలి అనిల్‌కుమార్‌ అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి.

పెద్దపల్లి టికెట్‌ దక్కిన ఎ.చంద్రశేఖర్‌ ఇటీవలి అసెంబ్లీ ఎన్ని కల్లో వికారాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనను సస్పెండ్‌ చేసిన కాంగ్రెస్‌, కొన్ని రోజుల క్రితమే ఎత్తివేసింది. అసెంబ్లీ ఎన్ని కల్లో పోటీ చేసి ఓడిపోయిన పొన్నం , బలరాం నాయక్‌, రేవంత్‌రెడ్డి, రాథోడ్‌ రమేశ్‌లకు ఎంపీ టికెట్లిచ్చారు. చేవెళ్ల నుంచి 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేసి గెలిచిన విశ్వేశ్వర్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరడం తెలిసిందే. మెదక్‌ టికెట్‌ దక్కించుకున్న గాలి అనిల్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌లో ఆవిర్భావం నుంచి పని చేశారు. పటాన్‌చెరు టికెట్‌ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు.