
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్. మే1 గురువారం నుంచి వీఐపీ సిఫారసు లేఖలను రద్దు చేసింది టీటీడీ. అలాగే సర్వదర్శనం సమయాన్ని పెంచడంతో పాటు.. వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని కూడా మార్చింది. మే 1 నుంచి జూలై 15 వరకు దాదాపు రెండున్నర నెలల పాటు ఈ నిబంధనలు అమలు కానున్నాయి. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకునీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది.
సమ్మర్ హాలిడేస్ కావడంతో తిరుమల దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. రోజురోజుకు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో తిరుమల వెంకన్న దర్శనానికి క్యూ లైన్ పెరిగిపోతోంది. రోజూ ఆలయం బయటకు వస్తున్న భక్తుల క్యూ లైన్ తిరుమలలో సాధారణంగా మారింది. దీంతో టీటీడీ ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. సర్వదర్శనం సమయాన్ని పెంచడంతోపాటు సామాన్య భక్తులకు శీఘ్రదర్శనం కల్పించాలన్న ఆలోచనతో సిఫారసు లేఖలను రద్దు చేసింది.
Also Read : సింహాచలం ఆలయంలో గోడ కూలి 8 మంది మృతి
అయితే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రం వెసులుబాటు కల్పించింది. స్వయంగా వచ్చే వీఐపీలను మాత్రమే ప్రోటోకాల్ వీఐపీలుగా పరిగణించి.. అలాంటి వారికి మాత్రమే ప్రోటోకాల్ దర్శనం ఇస్తుంది. అలానే వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లోనూ మార్పులు తీసుకువచ్చింది. బ్రేక్ దర్శన సమయాన్ని కుదించడం ద్వారా సర్వదర్శనం చేసుకునే సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించే అవకాశం ఉంటుందని టీటీడీ భావిస్తోంది.
వీఐపీ బ్రేక్ దర్శనాల సమయం
వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలోనూ మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం 5 గంటల 45 నిమిషాలకు ప్రొటోకాల్ దర్శనాలు.. 6 గంటల 30 నిమిషాలకు రెఫరల్ దర్శనాలు.. 6 గంటల 45 నిమిషాలకు జనరల్ బ్రేక్ దర్శనాలకు అనుమతిస్తారు. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు శ్రీవాణి దాతలు, 10 గంటల 30 నిమిషాలకి డోనర్స్.. 11 గంటలకు టీటీడీ ఉద్యోగుల బ్రేక్ దర్శనాలు ఉంటాయి. అయితే గురువారం తిరుప్పావడ, శుక్రవారం అభిషేక సేవ కారణంగా.. ఆ రెండు రోజులు మాత్రం బ్రేక్ దర్శనాలు పాత సమయం ప్రకారమే కొనసాగుతాయి.