పదేళ్ల క్రితం మా నోట్లో మట్టి కొట్టారు.. ఈసారైనా అమరావతి కడతారా మోడీజీ: షర్మిల సంచలన ట్వీట్

పదేళ్ల క్రితం మా నోట్లో మట్టి కొట్టారు.. ఈసారైనా అమరావతి కడతారా మోడీజీ: షర్మిల సంచలన ట్వీట్

అమరావతి పునః శంకుస్థాపన కోసం ప్రధాని మోడీ మే 2న ఏపీలో పర్యటించనున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో మోడీ అమరావతి పర్యటనను ఉద్దేశించి సంచలన ట్వీట్ చేశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఈసారైనా అమరావతి కట్టేనా.. మళ్ళీ మట్టేనా అంటూ ఎక్స్ వేదికగా ప్రధాని మోడీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు షర్మిల. పదేళ్ల క్రితం మట్టి తెచ్చి మా నోట్లో కొట్టారు.. మా ఆశల మీద నీళ్ళు చల్లి వెళ్ళారని అన్నారు. ఇప్పుడు రాజధాని పునఃశంకుస్థాపనకు వస్తున్న మోడీ గారికి ఇదే అమరావతి మట్టిని బహుమతిగా పంపిస్తున్నామంటూ ట్వీట్ చేశారు షర్మిల. 

ఈ మట్టిని చూసిన ప్రతిసారి 2015లో తొలి శంకుస్థాపనలో ఇచ్చిన హామీలు గుర్తు రావాలని.. పదేళ్లుగా చేసిన మోసంపై ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. ప్రధాని మోడీ ఈ మట్టి సాక్షిగా ప్రమాణం చేసి అమరావతిలో అడుగు పెట్టాలని..  మరోసారి ఇలాంటి మోసం చేయనని ప్రమాణం చేయాలని అన్నారు. విభజన హామీల్లో రాజధాని నిర్మాణం పూర్తిగా కేంద్రం బాధ్యత అని..  ఆ బాధ్యతకు కట్టుబడి ఉన్నానని, ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తా అని రాసి సంతకం పెట్టాలని డిమాండ్ చేశారు షర్మిల. 

మాకు అప్పులు వద్దు. మా భావితరాల మీద ఆ భారం వద్దు. రాజధాని నిర్మాణం కోసం బేషరతుగా రూ.1.50 లక్షల కోట్లను 3 ఏళ్లలో కేంద్రం ఇవ్వాలని అన్నారు. ఈమేరకు ప్రధాని మోడీ ప్రకటన చేయాలని అన్నారు షర్మిల. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాలని.. అలాగే పదేళ్లుగా అమలుకు నోచుకోని విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు షర్మిల.