తేడాలున్న ఓట్లపై ఫోకస్ చేద్దాం..ఒక్క ఓటు కూడా అనామలిస్ లిస్ట్లో ఉండిపోకూడదు: మీనాక్షి నటరాజన్

తేడాలున్న ఓట్లపై ఫోకస్ చేద్దాం..ఒక్క ఓటు కూడా అనామలిస్ లిస్ట్లో ఉండిపోకూడదు: మీనాక్షి నటరాజన్
  •     హైదరాబాద్‌‌లో ఓట్లు భారీగా తగ్గడంపై నిఘా పెట్టాలి: మహేశ్ ​గౌడ్
  •     జహీరాబాద్, మెదక్, మల్కాజ్‌‌గిరి, సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ల పార్టీ ముఖ్యులతో జూమ్ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: తేడాలున్న(అనామలిస్) ఓట్లను పరిశీలించి, అందులో అర్హులైన వారిని గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ నేతలకు సూచించారు. మంగళవారం జహీరాబాద్, మెదక్, మల్కాజ్‌‌గిరి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పార్టీ ముఖ్యులతో ఆమె జూమ్‌లో సమావేశమయ్యారు. ఇందులో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సర్‌‌‌‌పై నియమితులైన నియోజకవర్గ ఇన్‌‌చార్జిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనామలిస్‌‌ లిస్టులో 73 లక్షలకు పైగా ఓట్లు చేరడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో ఎక్కువగా కాంగ్రెస్‌‌కు అనుకూలమైన వర్గాల వారి ఓట్లు ఉండే అవకాశం ఉందని, ఈ విషయంలో బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

అనామలిస్‌‌లో ఉన్న ఓట్లను నిశితంగా పరిశీలించి అందులో అర్హులైన వారిని తిరిగి ఓటర్లుగా నమోదు చేయించేందుకు కావాల్సిన అన్ని ప్రక్రియలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ఓట్లు భారీగా అనామలిస్ జాబితాలో చేరి ఉంటాయని, కాంగ్రెస్‌‌కు అనుకూలమైన ఏ ఒక్క ఓటు కూడా అనామలిస్ లిస్ట్‌‌లోనే ఉండిపోకూడదని, ఈ విషయంలో పార్టీ నేతలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ సిటీలో ఓట్లు గణనీయంగా తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై గట్టి నిఘా పెట్టాలని కోరారు. అనామలిస్ జాబితాలో ఉన్న ప్రతి ఓటును నిశితంగా పరిశీలించి, తిరిగి వారికి ఓటు హక్కు కల్పించేలా బీఎల్ఏలతో పాటు పార్టీ ప్రజాప్రతినిధులు దృష్టిపెట్టాలని కోరారు.