కాంగ్రెస్ లో ఇలాగే ఉందా.. : ఢిల్లీ నుంచి పిలుపా.. టికెట్ లేనట్టేనా..?

కాంగ్రెస్ లో ఇలాగే ఉందా.. : ఢిల్లీ నుంచి పిలుపా.. టికెట్ లేనట్టేనా..?

= బుజ్జగింపుల కోసం హస్తిన పిలుస్తున్న అధిష్టానం
= పెద్దగా ప్రభావం చూపని జానారెడ్డి కమిటీ
= రంగంలోకి దిగిన ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌
= ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు నేతలకు పిలుపు
= అధిష్టానం ప్రకటించిన అభ్యర్థికి సహకరించాలని విజ్ఞప్తి
= రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవులిస్తామని భరోసా
= 64 మందితో సెకండ్ లిస్ట్..! ప్రాసెస్ పూర్తయ్యాకే రిలీజ్?

హైదరాబాద్: ఢిల్లీ ఏఐసీసీ ఆఫీసు నుంచి ఫోన్ వచ్చిందంటే చాలు టికెట్ లేనట్టే..? ఇది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్.. ఇప్పటి వరకు 55 సీట్లలో అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మరో 64 స్థానాలకు దాదాపుగా అభ్యర్థులను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయా స్థానాల నుంచి టికెట్లు ఆశిస్తున్న ఆశావహులను హస్తిన పిలిపించి.. ఈ సారి టికెట్ ఇవ్వలేకపోతున్నామని, మరో మారు కచ్చితంగా ఇస్తామని, అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవులు గానీ, ఎమ్మెల్సీ గానీ ఇస్తామని బుజ్జగిస్తున్నారు. రెబల్ గా బరిలోకిగి దిగకుండా ఉండడం, ప్రత్యర్థి పార్టీల్లో చేరకుండా ఉండేందుకు ఏఐసీసీ పెద్దలు ఈ ఆయుధాన్ని ఎంచుకున్నట్టు తెలిసింది. ఆదివారం ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఖమ్మం జిల్లాకు చెందిన నేతలతో చర్చించినట్టు తెలిసింది.

ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, పాలేరు, కొత్తగూడెంలలో ఏదేని ఓ టికెట్ కావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న రాయల నాగేశ్వరరావును ఢిల్లీ పిలిపించుకొని మాట్లాడారు. కేసీ వేణుగోపాల్ హామీపై స్పందించిన ఈ ఇద్దరు నేతలు ఖమ్మం జిల్లాలోని 10 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి గెలుపునకు కృషి చేస్తామని చెప్పినట్టు సమాచారం. ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావుకు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సెకండ్ లిస్ట్ లో టికెట్లు కేటాయించే అవకాశం ఉంది.

ప్రభావం చూపని జానారెడ్డి కమిటీ

బుజ్జగింపుల కోసం జానారెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో నేరుగా ఏఐసీసీ రంగంలోకి దిగిందని సమాచారం. ఫస్ట్ లిస్ట్ విడుదలైన తర్వాత జరిగిన పరిణామాలను బేరీజు వేసుకున్న ఏఐసీసీ అసంతృప్తులను బుజ్జగించే టాస్క్ తానే తీసుకున్నట్టు సమాచారం. ఫస్ట్ లిస్ట్ ప్రకటించాక అసంతృప్తులను కంట్రోల్ చేయడంలో జానారెడ్డి కమిటీ విఫలమైందని ఏఐసీసీ భావిస్తున్నట్టు సమాచారం. ఉప్పల్ నుంచి టికెట్ ఆశించిన రాగిడి లక్ష్మారెడ్డి రేవంత్ రెడ్డి అవినీతిపై ఆరోపణలు చేయడంతోపాటు భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్లి అవినీతికి పాల్పడలేదని ప్రమాణానికి రావాలని సవాలు చేశారు. గద్వాల టికెట్ ఆశించిన కురువ విజయ్ కుమార్ కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. ఆయన కూడా గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి ఆందోళన చేశారు.

గద్వాల టికెట్లు అమ్ముకున్నారని బహిరంగ ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడంతో విజయ్ కుమార్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మేడ్చల్ టికెట్ ఆశిస్తున్న హరివర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ నేతలతో టచ్ లోకి వెళ్లినట్టు సమాచారం. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలించిన ఏఐసీసీ నేరుగా రంగంలోకి దిగినట్టు సమాచారం. ముందుగా అసంతృప్తులకు సర్దిచెప్పి ఒక్కతాటి మీదకు తెచ్చాకే రెండో జాబితా విడుదల చేస్తారని తెలుస్తోంది. మరో నాలుగు రోజుల్లో కాంగ్రెస్ బస్సుయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో మలి విడత జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.