
- ఏఐసీసీ నేతలకు సీనియర్లు, గ్రేటర్ పీసీసీ నేతల మెయిల్స్
- సీఎంను, పీసీసీ చీఫ్నుఢిల్లీకి పిలిపించితిప్పి పంపడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు
- ఇతర పార్టీల ముందు, ప్రజల్లో చులకనైతున్నామని ఆవేదన
హైదరాబాద్, వెలుగు: పీసీసీ కార్యవర్గ ప్రకటన, నామినేటెడ్పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణను పదే పదే వాయిదా వేయడం సరికాదని, దీని వల్ల నష్టం జరుగుతున్నదని, ఇంకా నాన్చకుండా వెంటనే తేల్చేయాలని ఏఐసీసీ నేతలకు పార్టీలోని పలువురు సీనియర్లు, గ్రేటర్ పరిధిలోని కొందరు పీసీసీ నేతలు మెయిల్స్ ద్వారావిజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. పార్టీ వర్గాల్లో ఇది హాట్‌టాపిక్‌గా మారింది. ‘పీసీసీ కార్యవర్గం, నామినేటెడ్పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణను గత డిసెంబర్ నుంచి నేడు, రేపు అంటూ వాయిదా వేస్తున్నారు.
ప్రతి నెలా సీఎం రేవంత్‌ను, పీసీసీ చీఫ్మహేశ్కుమార్గౌడ్ను ఢిల్లీ పిలిపించుకొని చర్చలు జరుపుతున్నారు. వాళ్లిచ్చిన జాబితాల్లో మార్పులు చేర్పుల పేరుతో.. మధ్యన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్తదితరులను రప్పించి మంతనాలు చేస్తున్నారు. మార్చిలో ఇదిగో, అదిగో అంటూ 3 సార్లు వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ షరా మామూలే. తీరా ఈ నెలలో 26న కార్యవర్గం, మంత్రి వర్గ విస్తరణపై ప్రకటన ఉంటుందని చెప్పి, మరోసారి వాయిదా వేశారు. సీఎం రేవంత్ 2 రోజులు ఢిల్లీలో ఉండి ఉత్త చేతులతో తిరిగివచ్చారు. ఇలా పదే పదే వాయిదా వేయడం వల్ల ఇతర పార్టీల ముందు, ప్రజల్లో చులకనై పోతున్నాం. ప్రతిపక్షాల చేతికి మనమే అస్త్రాన్ని అందించినట్లు అవుతున్నది’’ అని హైకమాండ్‌కు పంపిన మెయిల్స్‌లో సీనియర్లు పేర్కొన్నట్లు తెలిసింది.
వెంటనే తేల్చకపోతే పార్టీకి నష్టం..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు గడిచిపోయాయని, అయినా ఇప్పటివరకు నామినేటెడ్‌పోస్టులు, మంత్రి పదవులు భర్తీ చేయకపోవడం, పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించకపోవడంతో కేడర్‌లోకి, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని, ఇది పార్టీకి తీవ్ర నష్టం చేస్తుందని సీనియర్లు హైకమాండ్ దృష్టికి తెచ్చినట్లు తెలుస్తున్నది. ‘‘త్వరలో లోకల్‌బాడీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది చివరలో కీలకమైన జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కార్యవర్గాన్ని , నామినేటెడ్ పోస్టులను ప్రకటిస్తే కేడర్ మరింత ఉత్సాహంగా ఎన్నికలకు రెడీ అవుతుంది. మంత్రివర్గ విస్తరణతో ప్రజల్లోనూ సానుకూల వాతావరణం ఉంటుంది. అలా కాకుండా వాయిదా వేస్తూ పోతే పరిస్థితి ప్రతిపక్షాలకు అనుకూలంగా మారి, ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుంది’’ అని మెయిల్స్‌లో ప్రస్తావించినట్లు సమాచారం.
పీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్ ను నియమించి 9 నెలలు దాటినా ఇప్పటికీ కనీసం రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించకపోవడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొందని, గతంలో కేసీఆర్ ప్రభుత్వం 6 నెలల వరకు కేబినెట్ విస్తరించకపోతే కాంగ్రెస్ తరఫున ఈ అంశంపై పదే పదే నిలదీస్తూ బీఆర్ఎస్ నేతలను ఇరుకున పెట్టామని, కానీ మన ప్రభుత్వంలో ఏకంగా 17 నెలలుగా 6 మంత్రి పదవులను భర్తీ చేయకపోవడంతో సొంత పార్టీ నేతల నుంచే విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తున్నదని పేర్కొన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అహర్నిశలు శ్రమించి, ఎమ్మెల్యే టికెట్లు రాని నేతలకు కనీసం నామినేటెడ్ పోస్టులు వస్తాయని భావించినా గత 17 నెలలుగా వాటిని భర్తీ చేయకపోవడం తో తీవ్ర నిరాశలో ఉన్నారని తెలిపినట్టు సమాచారం. ఇకనైనా కార్యవర్గం, నామినేటెడ్ పోస్టులు, మంత్రివర్గ విస్తరణపై వెంటనే తేల్చేసి.. పార్టీలో కొత్త ఉత్సాహం నింపాలని కోరినట్టు తెలుస్తున్నది.
ఢిల్లీ నుంచి ఆరా..
ఇటీవల రాష్ట్ర పర్యటన సందర్భంగా పార్టీలోని సీనియర్లు, ముఖ్యమైన లీడర్లతో రాష్ట్ర వ్యవహా రాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పలుమార్లు భేటీ అయ్యారు. పార్టీ నేతలు తమ అభిప్రా యాలను స్వేచ్ఛగా హైకమాండ్ దృష్టికి, అవస రమైతే రాహుల్ గాంధీ దృష్టికి కూడా తీసుకెళ్ల వచ్చని, కానీ బహిరంగంగా, మీడియా ముందు మాట్లాడి పార్టీకి నష్టం చేయవద్దని సూచించా రు. ఆమె సూచనల మేరకే నేతలు ధైర్యంగా హైకమాండ్ కు మెయిల్స్ చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణు గోపాల్, మీనాక్షి నటరాజన్ కు మంగళవారమే ఈ మెయిల్స్ అందినట్లు సమాచారం. అక్కడి నుంచి పీసీసీ నేతలను ఆరా తీయడంతో ఈ విషయం గాంధీభవన్వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.