
- హాజరైన డిప్యూటీ సీఎం, మంత్రులు
- పోటీలో ఉండబోమన్న బీఆర్ఎస్
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు వారు అసెంబ్లీ సెక్రటరీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందించారు. వారి వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి తదితరులున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తెలంగాణ ఇన్‌చార్జి దీపా దాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి తదితరులు కూడా హాజరయ్యారు. నామినేషన్ల సందర్భంగా అసెంబ్లీ వద్దకు భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పాడి కౌశిక్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వీరి స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తాము పోటీలో ఉండబోమని బీఆర్ఎస్ ఇదివరకే ప్రకటించింది. దీంతో ఈ రెండు స్థానాలకూ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగే అవకాశం ఉంది.
కష్టించి పనిచేసే వారికే గుర్తింపు: ఉత్తమ్
కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్న బల్మూరి వెంకట్ కు , పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న మహేశ్ కుమార్ గౌడ్ కు అందుకే ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కిందన్నారు.
అభ్యర్థుల బయోడేటా
పేరు : బల్మూరి వెంకట నర్సింగరావు
తండ్రి: మదన్‌మోహన్‌రావు
పుట్టిన తేదీ : నవంబర్ 2, 1992
విద్యార్హత: ఎంబీబీఎస్
స్వగ్రామం: తారుపల్లి, కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా
సామాజిక వర్గం: ఓసీ (వెలమ)
బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్
తండ్రి: బి.గంగాధర్ గౌడ్
పుట్టిన తేదీ: ఫిబ్రవరి 24, 1966
విద్యార్హత: బీకాం
స్వగ్రామం: రహత్‌నగర్, భీంగల్ మండలం, నిజామాబాద్ జిల్లా
సామాజిక వర్గం: బీసీ (గౌడ)