ఆదిలాబాద్, వెలుగు: మహారాష్ట్రలో ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ పోలీసులపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ చోరీ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ పోలీసులపై మహారాష్ట్రలో దాడికి పాల్పడ్డారు.
బజార్ హత్నూర్ లో జరిగిన ఆటో చోరీ కేసులో నిందితుడు షేక్ బకర్ అలియాస్ జాఫర్‌ను పట్టుకునేందుకు బజార్‌హత్నూర్ ఎస్సై రమేశ్ గోకల, ముగ్గురు కానిస్టేబుళ్లు ఆగస్టు 30న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్‌కు వెళ్లారు. చిక్లీ గ్రామం వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి తీసుకుని ఆదిలాబాద్ కు తిరిగి వస్తుండగా, చిక్లీ క్రాస్ రోడ్డు వద్ద 60 మంది గ్రామస్తులు పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు.
ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో ఎస్సై తలకు గాయం కాగా, పోలీసులకు స్వల్పగాయాలయ్యాయి. పరిస్థితి చేయిదాటడంతో ఆత్మ రక్షణ కోసం ఎస్సై తన సర్వీస్ రివాల్వర్ తో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పోలీసుల నుంచి నిందితుడు తప్పించుకోగా, ఘటనా స్థలానికి చేరుకున్న కిన్వట్ పోలీసుల సహకారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
