మంచిర్యాలలో సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభం

మంచిర్యాలలో సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభం
  •     స్టూడెంట్లతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే

మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తూ వారి బంగారు భవిష్యత్​కు బాటలు వేస్తోందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్​లో ఉన్న ఓల్డ్ మెడికల్ కాలేజీ ఆవరణలో ఏర్పాటుచేసిన ‘సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్’ను సోమవారం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాశ్, డీసీపీ ఎ.భాస్కర్, అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్య, శ్రీరాంపూర్ జీఎం రాధాకృష్ణ, హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులు సత్యచంద్ర దాస్, కాంతయ్యదాస్​తో కలిసి ప్రారంభించారు. 

విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీటింగ్ లో మాట్లాడుతూ.. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ స్టూడెంట్లకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందిస్తామని తెలిపారు. జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని 17 మండలాల పరిధిలో 691 స్కూళ్లలో చదువుతున్న 42,450 మంది విద్యార్థు లకు, 13 జూనియర్ కాలేజీల్లో చదువుతున్న 6,654 మంది విద్యార్థులకు ప్రతిరోజూ పోషక విలువలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ అందిస్తామని తెలిపారు. 

జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, జన్నారం, మందమర్రి, లక్సెట్టిపేట, దండేపల్లి, కాసిపేట, నెన్నెల, హాజీపూర్, నస్పూర్, భీమారం మండలాలు, జగిత్యాల జిల్లాలోని వెల్లటూరు, ఎండపల్లి, పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి, అంతర్గాం, పాలకుర్తి మండలాల్లోని స్టూడెంట్స్​కు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటుకు సింగరేణి సంస్థ రూ.8 కోట్ల నిధులు అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్, అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.