సైబర్ దందాపై సీఎస్‌‌‌‌బీ దండయాత్ర..5 రాష్ట్రాల్లో 25 రోజుల స్పెషల్ ఆపరేషన్

సైబర్ దందాపై  సీఎస్‌‌‌‌బీ దండయాత్ర..5 రాష్ట్రాల్లో 25 రోజుల స్పెషల్ ఆపరేషన్
  • ఏడుగురు మహిళలు సహా 81 మంది అరెస్ట్ 
  • దేశవ్యాప్తంగా 754 కేసుల్లో కేటుగాళ్లకు లింకులు 
  • రూ.95 కోట్లు కొల్లగొట్టినట్లు గుర్తింపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సైబర్  నేరాల ఆట కట్టించేందుకు తెలంగాణ సైబర్  సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్‌‌‌‌బీ) భారీ ఆపరేషన్  చేపట్టింది. సైబర్  నేరగాళ్ల నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ ను ఛేదించేందుకు ఏకంగా ఐదు రాష్ట్రాల్లో 25 రోజుల పాటు వేట కొనసాగించింది. మహారాష్ట్ర, కర్నాటక,  కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌‌‌‌  పోలీసులతో కలిసి మెరుపు దాడులు నిర్వహించి ఏడుగురు మహిళలు సహా 81 మందిని అరెస్టు చేసింది. 

ఈ ముఠాకు రాష్ట్రంలోని 41 సైబర్  క్రైం కేసులతో పాటు దేశవ్యాప్తంగా 754 కేసులతో సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిందితులు అమాయకుల నుంచి ఏకంగా రూ.95 కోట్లు కొల్లగొట్టినట్లు ఆధారాలు సేకరించారు. ఈ భారీ ఆపరేషన్  వివరాలను టీజీ సీఎస్‌‌‌‌బీ డైరెక్టర్  శిఖా గోయల్ ఆదివారం మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో నమోదైన సైబర్ క్రైం కేసుల దర్యాప్తులో భాగంగా టీజీ సీఎస్‌‌‌‌బీ అధికారులు భారీ అంతర్రాష్ట్ర ఆపరేషన్‌‌‌‌కు ప్లాన్  చేశారు. 

మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు, ఏపీ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ 25 రోజుల పాటు ఏకకాలంలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. నిందితుల కదలికలపై నిఘా పెట్టి పక్కా ఆధారాలతో వారిని అదుపులోకి తీసుకున్నారు. కేరళలో 28, మహారాష్ట్రలో 23, కర్నాటకలో 13, ఏపీలో 10, తమిళనాడులో  ఏడుగురిని అరెస్టు చేశారు. నిందితులందరినీ ట్రాన్సిట్  వారంట్ పై తెలంగాణకు తీసుకొచ్చారు. వారిని ఆయా స్థానిక కోర్టుల్లో ప్రవేశపెట్టగా.. కోర్టులు రిమాండ్  విధించాయి. నిందితుల నుంచి 84 మొబైల్ ఫోన్లు, 101 సిమ్‌‌‌‌ కార్డులు, 89 బ్యాంకు పాస్‌‌‌‌బుక్‌‌‌‌లను స్వాధీనం చేసుకున్నారు. 

ముఠాలో బ్యాంకు ఉద్యోగులు

పట్టుబడిన నిందితుల్లో 17 మంది ఏజెంట్లు కాగా, 11 మంది సైబర్  నేరాల్లో కొల్లగొట్టిన డబ్బును ఏటీఎంల నుంచి డ్రా చేసేవారు ఉన్నారు.  మరో 53 మంది తమ బ్యాంకు ఖాతాలను (మ్యూల్ అకౌంట్లు) 5 శాతం కమీషన్  కోసం నేరగాళ్లకు అప్పగించిన వారు ఉన్నారు. నిందితుల్లో ఐడీఎఫ్‌‌‌‌సీ, ఫెడరల్, బంధన్  బ్యాంకు ఉద్యోగులు, ఓ బ్రాంచ్ మేనేజర్, చెన్నైలోని ఆడిట్ ఆఫీస్‌‌‌‌లో పనిచేసే అకౌంటెంట్, బీబీఏ గ్రాడ్యుయేట్,  ఎంఎన్‌‌‌‌సీ ఉద్యోగి కూడా ఉన్నారు.

విదేశీ ముఠాలతో లింకులు

ఈ ముఠాకు విదేశాల్లోని సైబర్  నేరగాళ్లతోనూ సంబంధాలు ఉన్నట్లు సీఎస్‌‌‌‌బీ అధికారులు గుర్తించారు. వారిపై లుక్ ఔట్  సర్క్యులర్లు (ఎల్ఓసీ) జారీ చేసి దేశం నుంచి పారిపోకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌‌‌‌లో కీలక పాత్ర పోషించిన అదనపు ఎస్పీ భిక్షంరెడ్డి, డీఎస్పీలు కేవీ సూర్యప్రకాశ్, ఎస్‌‌‌‌వీ హరికృష్ణ, కేవీఎం ప్రసాద్  బృందాలను డైరెక్టర్  శిఖా గోయల్  అభినందించారు.