ఆల్మోంట్ సిరప్ వాడొద్దు.. ప్రజలకు తెలంగాణ డీసీఏ రెడ్ అలర్ట్ జారీ

ఆల్మోంట్  సిరప్ వాడొద్దు.. ప్రజలకు తెలంగాణ డీసీఏ రెడ్ అలర్ట్ జారీ
  •   అందులో ప్రాణాంతక ఈథిలీన్ గ్లైకాల్ గుర్తింపు
  •     మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు
  •     బ్యాచ్ నంబర్ ఏఎల్-24002 కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సూచన

    

హైదరాబాద్, వెలుగు: చిన్న పిల్లల్లో జలుడు, అలర్జీ తగ్గడం కోసం వాడే ఓ సిరప్‌ లో ప్రాణాంతకమైన రసాయనాలు ఉన్నట్లు తేలడంతో రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) ఆ మందు అమ్మకాలను నిషేధించింది. ఆల్మోంట్–కిడ్ అనే సిరప్‌ లో ప్రమాదకరమైన ఎథిలీన్ గ్లైకాల్ ఉన్నట్లు కోల్‌ కతాలోని సెంట్రల్ డ్రగ్స్ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర డీసీఏ డీజీ షానవాజ్ ఖాసిం శనివారం పబ్లిక్ అలర్ట్ జారీ చేశారు. ఈ విషయం తెలియగానే రాష్ట్రంలోని డ్రగ్ ఇన్‌స్పెక్టర్లందరినీ షానవాజ్ ఖాసిం అలర్ట్ చేశారు. మెడికల్ షాపులు, హోల్‌ సేల్ డిస్ట్రిబ్యూటర్లు, హాస్పిటల్స్ దగ్గర ఈ బ్యాచ్ నంబర్ గల స్టాక్ ఉంటే వెంటనే అమ్మకాలు ఆపేయాలని ఆదేశించారు. ఎవరైనా ఈ మందును డిస్పెన్స్ చేసినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఎవరైనా ఈ బ్యాచ్ నంబర్ గల సిరప్‌ ను గుర్తిస్తే, ఎవరైనా అమ్ముతుంటే వెంటనే డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌ టోల్ ఫ్రీ నంబర్ 1800- 5996969 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

బీహార్ లో మానుఫ్యాక్చరింగ్ కంపెనీ

బీహార్‌ లోని వైశాలి జిల్లా హాజీపూర్‌ కు చెందిన ట్రైడస్ రెమెడీస్ అనే ఫార్మా కంపెనీ.. ఆల్మోంట్ కిడ్ పేరుతో పిల్లల కోసం సిరప్‌ ను తయారు చేస్తున్నది. ఇందులో లెవోసిటిరిజైన్, మాంటెలుకాస్ట్ సోడియం వంటి డ్రగ్స్ ఉంటాయి. అయితే... జనవరి-2025లో తయారైన బ్యాచ్ నంబర్ ఏఎల్-24002(మానుఫ్యాక్చరింగ్ తేదీ జనవరి–2025, ఎక్స్ పైరీ.. తేదీ డిసెంబర్ 2026) మందులో.. ఉండకూడని ఎథిలీన్ గ్లైకాల్ అనే టాక్సిక్ సబ్ స్టెన్స్ ఉన్నట్లు కోల్‌ కతాలోని సీడీఎస్‌సీవో గుర్తించింది. వెంటనే తెలంగాణ డీసీఏని అలర్ట్ చేసింది. కాగా, ఎథిలీన్ గ్లైకాల్ కెమికల్ మోతాదు ఎక్కువైతే.. పిల్లల కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.