- ఖేల్‌రత్నకు హాకీ స్టార్ హార్దిక్ సింగ్‌ను
- రికమెండ్ చేసిన సెలెక్షన్ కమిటీ
న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన డెఫ్ షూటర్ ధనుష్ శ్రీకాంత్, బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గాయత్రి ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం అర్జున అవార్డు రేసులో నిలిచారు. దేశవ్యాప్తంగా వివిధ క్రీడల్లో రాణించిన 24 మంది పేర్లను అవార్డుల సెలెక్షన్ కమిటీ అర్జునకు బుధవారం నామినేట్ చేయగా.. రాష్ట్రం నుంచి ధనుష్, గాయత్రి ఈ జాబితాలో ఉన్నారు. టోక్యో, పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలు నెగ్గిన ఇండియా హాకీ టీమ్ మెంబర్ హార్దిక్ సింగ్ ఒక్కడినే అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నకు సిఫారసు చేసింది. పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్నప్పటికీ ధనుష్ శ్రీకాంత్ తన ఆత్మవిశ్వాసంతో ఆ వైకల్యాన్ని జయించాడు. ఇటీవల బ్రెజిల్‌లో జరిగిన డెఫ్ ఒలింపిక్స్ లో రెండు స్వర్ణ పతకాలు సాధించాడు. ఇంటర్నేషనల్ లెవెల్‌లో నిలకడగా రాణిస్తున్న ధనుష్ ప్రతిభను సెలెక్షన్ కమిటీ గుర్తించింది. ఇక ట్రీసా జాలీతో కలిసి విమెన్స్ డబుల్స్‌లో గాయత్రి నిలకడగా రాణిస్తోంది. ఈ ఇద్దరూ అర్జునకు నామినేట్ అయ్యారు. చెస్ వరల్డ్ కప్ విన్నర్ దివ్య దేశ్‌ముఖ్, హైజంపర్ తేజస్విన్ శంకర్ తదితరులు కూడా అర్జున రేసులో ఉన్నారు. ఈ సారి ఒక్క క్రికెటర్ కూడా నామినేట్ అవ్వలేదు. సెలెక్షన్ కమిటీ సిఫారసు చేసిన ఈ జాబితాను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుంది. తుది ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రపతి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. అర్జున గ్రహీతలకు అవార్డుతో పాటు రూ. 15 లక్షల నగదు, ఖేల్‌రత్నకు రూ. 25 లక్షల ప్రైజ్‌మనీ కూడా అందిస్తారు.
