- మంత్రి అడ్లూరిని కోరిన డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల అధ్యాపకులకు యూజీసీ పే స్కేల్ ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను తెలంగాణ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఎంపవరింగ్ అసోసియేషన్ నేతలు కోరారు. ఈ మేరకు గురువారం మంత్రిని కలిసి అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరింపజేశారు. తమ సమస్యలపై వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. గత ఏడాది రెగ్యులర్ అయిన డిగ్రీ లెక్చరర్లకు యూజీసీ పే స్కేల్ ఇస్తున్నారని, 2016లో రిక్రూట్ అయిన తమకు మాత్రం ఇవ్వడం లేదని నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
అదే విధంగా లెక్చర్లర్ల టైమ్ టేబుల్ మార్చాలని , ఉన్నతాధికారులు నాన్ అకడమిక్ డ్యూటీలు ఎక్కువ అలాట్ చేస్తున్నారని తెలిపారు. ఈ సమస్యలపై త్వరలో ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తామని లెక్చరర్లకు మంత్రి అడ్లూరి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ సాంబలక్ష్మి, మాలతి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
