తెలంగాణలో ఎన్నికల హడావిడి... సీపీలు, ఎస్పీలతో డీజీపీ సమావేశం

తెలంగాణలో ఎన్నికల హడావిడి... సీపీలు, ఎస్పీలతో డీజీపీ సమావేశం

తెలంగాణాలో అప్పుడే ఎలక్షన్స్‌‌‌‌ వాతావరణం మొదలైందని డీజీపీ అంజనీకుమార్ అన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్నందున అలర్ట్​గా ఉండాలని సీపీలు, ఎస్పీలకు డీజీపీ అంజనీకుమార్ సూచించారు. ఈ సందర్బంగా కమిషనర్లు, ఎస్పీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతి ఎన్నికల్లో కూడా కొత్త సవాళ్లు ఎదురవుతాయని ఆయన అన్నారు.  ఐదారు నెలల్లో ఎన్నికలు జరగనున్నందన ఏర్పాట్లపై పునశ్చరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి

జూన్, జూలై నెలల్లో  ఎన్నికలకు సంబంధించి బందోబస్త్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, సిబ్బంది డిప్లాయ్ మెంట్, కేంద్ర బలగాలతో సమన్వయం తదితర అన్ని అంశాలపై స్పష్టత కలిగి ఉండేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని యూనిట్ అధికారులకు డీజీపీ అంజనీకుమార్ సూచించారు. ప్రస్తుతం యూనిట్ అధికారుల్లో చాలామంది కొత్తవారున్నందున .. ఎన్నికల నిర్వహణలో అనుభవం ఉన్న  పోలీస్ అధికారి సహకారం తీసుకోవాలని ఆయన  అన్నారు.

కర్నాటక ఎన్నికలకు తెలంగాణ పోలీసులు

కర్ణాటక ఎన్నికలకు   అడిషనల్ డీజీ సౌమ్యా మిశ్రా, పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ నవీన్ కుమార్, సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం డీసీపీ అభిషేక్ మొహంతిలను కేంద్ర ఎన్నికల సంఘం  శాంతి భద్రతల పరిశీలకులుగా నియమించింది. వారికి అక్కడ ఎదురైన అనుభవాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు.

అడిషనల్ డీజీ సౌమ్యా మిశ్రా ప్రెజెంటేషన్

ఎన్నికల నిర్వహణలో పోలీసుల పాత్ర, భద్రతా దళాల డిప్లాయ్ మెంట్,  నామినేషన్ పత్రాల దాఖలు నుండి ప్రచార పర్వం, పోలింగ్ రోజు నిర్వహణ తదితర అంశాలపై  చేపట్టాల్సిన ప్రణాళికలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలా శాంతి భద్రతలను పర్యవేక్షించాలో  అడిషనల్ డీజీ సౌమ్యా మిశ్రా  ప్రెజెంటేషన్ ఇచ్చారు.  ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన ప్రత్యేక చర్యలు,ఈవీఎంల తరలింపు, కౌంటింగ్ రోజున చేపట్టాల్సిన ప్రత్యేక బందోబస్తు తదితర అంశాల గురించి వివరించారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం

ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మూడేళ్లు పూర్తయిన ప్రతీ పోలీస్ అధికారిని  బదిలీ చేయాలని  ఇంటలిజెన్స్ విభాగం అడిషనల్ డీజీ అనీల్ కుమార్ తెలిపారు.సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సరిహద్దు ప్రాంతాల చెక్ పోస్ట్ ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్ అన్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్లో ఒక గైడ్ పోలీస్ను ఎంపిక చేయాల్సి ఉంటుందని, ఈ గైడ్ పోలీస్ అధికారి కేంద్ర బలగాలకు ఉపయోగకరంగా ఉంటారని సీఐడీ విభాగం అడిషనల్ డీజీ మహేష్ భగవత్ తెలిపారు.  ఎన్నికల ప్రకటన విడుదలైన తరువాత ఎలాంటి బదిలీలు చేపట్టరాదని సూచించారు.  రాష్ట్రానికి వచ్చే కేంద్ర పారా మిలటరీ దళాల మోహరింపు తదితర అంశాల పర్యవేక్షణకై ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని తెలంగాణా పోలీస్ బెటాలియన్స్ అడిషనల్ డీజీ స్వాతి లక్రా వెల్లడించారు. శిక్షణలో ఉన్న ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్ సేవలను కూడా ఉపయోగించుకోవాలని అడిషనల్ డీజీ విజయ్ కుమార్ సూచించారు.

గుడ్ ప్రాక్టీసెస్ అవసరం

గత ఎన్నికల్లో  అమలు చేసిన గుడ్ ప్రాక్టీసెస్ (ఉత్తమ చర్యలు)ను అమలు చేయాలని ఐజి షానవాజ్ ఖాసిం అన్నారు. . ఎన్నికల నిర్వహణకు ఆరునెలల ముందే ఈ విధమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం వల్ల  ఎన్నికల నిర్వహణ మరింత సులభతరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.  ఎన్నికల నిర్వహణలో  సూక్ష్మ స్థాయి ప్రణాళికలు తయారు చేయాల్సి ఉంటుందని ఇంటలిజెన్స్ విభాగం డీఐజీ కార్తికేయ తెలిపారు.  క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, వల్నరబుల్ పోలింగ్ కేంద్రాల గుర్తింపు పట్ల స్పష్టతతో ఉండాలని సూచించారు.