మావోయిస్టుల కంటే గంజాయి స్మగ్లర్లే డేంజర్.. సరిహద్దులు బ్లాక్ చేస్తాం: డీజీపీ సీవీ ఆనంద్

మావోయిస్టుల కంటే గంజాయి స్మగ్లర్లే డేంజర్.. సరిహద్దులు బ్లాక్ చేస్తాం: డీజీపీ సీవీ ఆనంద్

మావోయిస్టుల కంటే గంజాయి స్మగ్లర్లే సమాజానికి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా కమిషనరేట్ పరిధిలో  క్రైమ్ రివ్యూ నిర్వహించిన ఆయన, శాంతిభద్రతల పరిరక్షణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మాదకద్రవ్యాల మహమ్మారి వల్ల కొన్ని రాష్ట్రాల జీడీపీ సైతం పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేసిన డీజీపీ.. గంజాయి మూలాలను నిర్వీర్యం చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి గంజాయి రాకుండా సరిహద్దు ప్రాంతాలైన ఖమ్మం, కొత్తగూడెం, ఆదిలాబాద్, ములుగు ఎంట్రీ పాయింట్స్‌ను పూర్తిగా బ్లాక్ చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఖమ్మం జిల్లాలో కన్విక్షన్ రేటు అంటే నేరస్థులకు శిక్ష పడే శాతం చాలా తక్కువగా ఉందని, కేవలం కేసులు పెట్టడమే కాకుండా చార్జ్ షీట్లు వేసి, కోర్టు విచారణకు హాజరవుతూ నేరస్థులకు శిక్ష పడేలా చూడాలన్నారు. ఖమ్మంలో రాత్రి వేళల్లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నందున.. డే అండ్ నైట్ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, క్రిమినల్స్ పై నిఘా పెట్టాలని ఆదేశించారు.

ఇకపై ప్రతిరోజూ సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు ఎస్సైలు, ఉన్నతాధికారులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉండి పిటిషనర్ల సమస్యలు వినాలని స్పష్టమైన రూల్ పెట్టారు. టెక్నాలజీ వాడకంలో తెలంగాణ పోలీసులు ఎప్పుడూ ముందే ఉంటారని.. ప్రస్తుతం పోలీసులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణకు జిల్లాలో సైబర్ క్రైమ్ సెల్‌ను ప్రారంభించామని చెబుతూ.. సమాజంలో రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు.