తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఎంసెట్ 2021 ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. జేఎన్టీయూలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, జెఎన్టీయు వైస్ ఛాన్సలర్ కట్ట నర్సింహా రెడ్డి, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. 

కరోనాక్లిష్ట పరిస్థితుల్లోనూ ఎంసెట్ నిర్వహించామని మంత్రి సబితా అన్నారు. కరోనా కారణంగా అన్ని రంగాలు ఎఫెక్ట్ అయ్యాయని ఆమె అన్నారు. వాటిలో విద్యా వ్యవస్థ బాగా ప్రభావితమైందని ఆమె తెలిపారు. ఈ సారి 28 వేల మంది అదనంగా పరీక్షలు రాశారని ఆమె చెప్పారు. ఆన్లైన్ ద్వారా పరీక్షలు విజయవంతంగా నిర్వహించిన జేఎన్టీయూకి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 30 నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభిస్తామని ఆమె తెలిపారు. 

ఆగష్టు 4, 5, 6, 10, 11 తేదీలలో ఎంసెట్ నిర్వహించారు. అగ్రికల్చర్, మెడికల్  స్ట్రీమ్ పరీక్షకు 91.19 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 98.48 శాతం మంది అర్హత సాధించారు. మెడికల్ స్ట్రీమ్ లో హైదరాబాద్ బాలానగర్ కు చెందిన మండవ కార్తీకేయ మొదటి ర్యాంకు సాధించగా.. రంగారెడ్డికి చెందిన హిమని శ్రీనిజ సెంకండ్ ర్యాంక్ సాధించింది. 

ఇంజినీరింగ్ లో 82.07 శాతం మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్ కు సంబంధించి ఏపీ విద్యార్థులు ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించారు. పశ్చిమ గోదావరికి చెందిన సత్తి కార్తికేయ మొదటి ర్యాంకు, కడపకు చెందిన వెంకట ప్రణీత్ సెకండ్ ర్యాంక్, హైదరాబాద్ కు చెందిన ఎండీ మతీన్ మూడో ర్యాంకు సాధించారు. 

ఫలితాలు https://eamcet.tsche.ac.in వెబ్‌సైట్ అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.