జులైలో ఎంసెట్..మార్చిలో నోటిఫికేషన్ .?

జులైలో ఎంసెట్..మార్చిలో నోటిఫికేషన్ .?
  • మార్చిలో నోటిఫికేషన్ జారీకి ఏర్పాట్లు 
  • జేఈఈ, ఇంటర్ ఎగ్జామ్స్​కు అనుగుణంగా తేదీల నిర్ణయం 
  • ఫీజు పెంచే ఆలోచన లేదన్న ఉన్నత విద్యామండలి
  • అన్ని ప్రవేశ పరీక్షలనిర్వహణకూ ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఎంట్రెన్స్ లు నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి రెడీ అవుతోంది. ఇప్పటికే అన్ని సెట్లకు కన్వీనర్లను నియమించిన కౌన్సిల్, వారం రోజుల్లో పూర్తిస్థాయి కమిటీలను నియమించేందుకు కసరత్తు చేస్తోంది. జులైలో టీఎస్ ఎంసెట్ పెట్టాలనే యోచనలో కౌన్సిల్ అధికారులున్నారు. జేఈఈ మెయిన్, ఇంటర్ పరీక్షలకు అనుగుణంగా ఎంసెట్ తేదీలను నిర్ణయించాలని భావిస్తున్నారు. 

మిగిలిన ఎంట్రెన్స్​లనూ జూన్, జులై నెలల్లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు. కరోనా వల్ల 2021–22 అకడమిక్ ఇయర్​లో స్కూళ్లు, కాలేజీలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. వీటి ప్రభావం ప్రవేశ పరీక్షలపైనా పడుతోంది. గత నెలలో ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీఈసెట్, ఎడ్ సెట్, లాసెట్, పీఈసెట్ తదితర ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లను నియమించారు. వారం రోజుల్లో అన్ని సెట్లకు పూర్తిస్థాయి కమిటీలు వేసేందుకు కౌన్సిల్ కసరత్తు చేస్తోంది. ఇంటర్, డిగ్రీ పరీక్షల ఆధారంగానే వీటిని నిర్వహించాల్సి ఉండటంతో, ఆ తేదీల ఆధారంగా కుదిరితే మార్చి నెలలో అన్నిసెట్లకు నోటిఫికేషన్లు వేయాలని అధికారులు భావిస్తున్నారు. పీఈసెట్ మినహా మిగిలిన అన్ని ఎంట్రెన్స్ లు కూడా ఆన్​లైన్​లోనే నిర్వహిస్తారు. దీంతో ఇతర పోటీ పరీక్షలు, నేషనల్ టెస్టులను గమనించి, ఆయా పరీక్షలషెడ్యూల్​ను రెడీ చేయనున్నారు. ఈఏడాది కూడా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ఫీజు పెంచొద్దని ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు. 

జేఈఈ తేదీలకు అనుగుణంగా ఎంసెట్...

ఐఐటీల్లో ఎంట్రెన్స్​కోసం నిర్వహించే జేఈఈ మెయిన్​–2022 షెడ్యూల్​కు అనుగుణంగా ఎంసెట్ తేదీలు ఖరారు కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జేఈఈ మెయిన్​ఎగ్జామ్​ను రెండు సార్లు నిర్వహిస్తుందా, నిరుటి లెక్కనే నాలుగు సార్లు పెడుతుందా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ వారం రోజుల్లో జేఈఈ మెయిన్ నోటిఫికేషన్, షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశముంది. ఇంటర్ పరీక్షల తేదీలూ కూడా ప్రకటించనున్నారు. మే ఫస్ట్ వీక్​లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశముందని ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత 30 నుంచి 45 రోజులు స్టూడెంట్లకు ప్రిపరేషన్ కు టైమ్ ఇచ్చి, ఆ తర్వాత ఎంసెట్​నిర్వహించనున్నారు. ఈ లెక్కన జులై నెలలో ఎంసెట్ ఎగ్జామ్ నిర్వహించే అవకాశముంది. మిగిలిన అన్ని ప్రవేశ పరీక్షలూ జూన్, జులైలో ఉండే చాన్స్ ఉంది.

వచ్చేనెలలో నోటిఫికేషన్లు.. 

ప్రస్తుతం సెట్ల కన్వీనర్లను ప్రకటించాం. అన్ని సెట్ల చైర్మన్లు, కన్వీనర్లతో మాట్లాడి త్వరలోనే పూర్తిస్థాయి కమిటీలను నియమిస్తం. కరోనా నేపథ్యంలో ఈసారి ప్రవేశపరీక్ష ఫీజులను పెంచొద్దని భావిస్తున్నం. మార్చిలో అన్ని సెట్ల నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తం. ఇంటర్, జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్ అనుగుణంగా ఎంసెట్ తేదీలు ప్రకటిస్తం.                                                                                                                                                               - ఆర్.లింబాద్రి, టీఎస్​సీహెచ్ఈ చైర్మన్