అభ్యర్థుల ఆదాయాలపై ఫోకస్ పెట్టండి

అభ్యర్థుల ఆదాయాలపై ఫోకస్ పెట్టండి
  • కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు అడ్వకేట్ల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఆదాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు అడ్వకేట్లు కోరారు. తెలంగాణలో డబ్బులు, మద్యం పంపిణి పెరిగిందని ఈసీఐ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహాన్ని అరికట్టి, ఓటర్లను ప్రభావితం చేయకుండా చూడాలని కోరారు. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టు అడ్వకేట్ల బృందం ఢిల్లీలోని నిర్వచన్ సదన్ లో కేంద్ర ఎన్నికల అధికారులను కలిసి వినతి పత్రం సమర్పించింది.

అనంతరం తెలంగాణ భవన్ లో అడ్వకేట్ల ప్రతినిధి జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఈసీఐకి పలు విజ్ఞప్తులు చేసినట్లు చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఆస్తులు, కేసులను ఈసీ పరిశీలించాలని కోరామన్నారు. 2018లో పోటీ చేసిన అభ్యర్థుల ఆదాయాలు ఈ  ఐదేళ్లలో విపరీతంగా పెరిగాయని వాటిపై ఫోకస్ పెట్టాలని డిమాండ్ చేశారు. పత్రికలు, టీవీల్లో క్రిమినల్ కేసులపై కూడా  ప్రకటనలు ఇవ్వాలన్నారు. దీని ఆధారంగా ఎన్నికల్లో నేరస్థులు పోటీ చేయకుండా చూడాలని విజ్ఞప్తి చేశామన్నారు.