పంటలకు విద్యుత్సరఫరాపై సర్కారు ఫోకస్‌‌‌‌.. క్షేత్రస్థాయిలో అధికారుల ఆకస్మిక తనిఖీలు

పంటలకు విద్యుత్సరఫరాపై సర్కారు ఫోకస్‌‌‌‌.. క్షేత్రస్థాయిలో అధికారుల ఆకస్మిక తనిఖీలు
  •  పంటలు ఎండకుండా విద్యుత్​సరఫరాపై సర్కారు ఫోకస్‌‌‌‌ 
  • ప్రభుత్వ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో అధికారుల పర్యటనలు 
  • షాద్‌‌‌‌నగర్‌‌‌‌, రాయికల్‌‌‌‌, రామేశ్వరంలో సదరన్‌‌‌‌ డిస్కం సీఎండీ జితేశ్‌‌‌‌ వి. పాటిల్‌‌‌‌ తనిఖీలు  

హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ విద్యుత్‌‌‌‌ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో విద్యుత్‌‌‌‌ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. కరెంట్‌‌‌‌ సరిగా సరఫరా కాక పంటలు ఎండిపోతున్నాయనే విమర్శలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో డిస్కంల సీఎండీలు, డైరెక్టర్లు, చీఫ్‌‌‌‌ ఇంజినీర్లు, జిల్లా సూపరింటెండింగ్‌‌‌‌ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ సదరన్‌‌‌‌ డిస్కం సీఎండీ జితేశ్‌‌‌‌ వి. పాటిల్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ మెగా సిటీ శివారులోని షాద్‌‌‌‌నగర్‌‌‌‌, రాయికల్‌‌‌‌, రామేశ్వరం ప్రాంతాల్లో పర్యటించారు. రైతులతో మాట్లాడి విద్యుత్‌‌‌‌ సరఫరా తీరును తెలుసుకున్నారు. ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లు, ఫీడర్లను తనిఖీ చేసి సరఫరా పరిస్థితులను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అధికారులు వ్యవసాయ విద్యుత్‌‌‌‌ సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

వ్యవసాయ ఫీడర్లు, ట్రాన్స్‌‌‌‌ఫార్మర్ల పరిశీలన..

రాష్ట్రంలో మొత్తం 6,15,651 వ్యవసాయ విద్యుత్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లు, 2,51,213 కిలోమీటర్ల వ్యవసాయ విద్యుత్‌‌‌‌ లైన్లు ఉన్నాయి. వీటి ద్వారా 30.60 లక్షల వ్యవసాయ విద్యుత్‌‌‌‌ కనెక్షన్లకు సరఫరా అందుతోంది. వ్యవసాయ ట్రాన్స్‌‌‌‌ఫార్మర్ల మొత్తం సామర్థ్యం 21,717 ఎంవీఏలుగా ఉంది. ప్రభుత్వ ఆదేశాలతో విద్యుత్‌‌‌‌ శాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ డిస్ట్రిబ్యూషన్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌ఫార్మర్ల పనితీరును పరిశీలిస్తున్నారు. 

ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లు కాలిపోవడానికి కారణాలు, విద్యుత్‌‌‌‌ లైన్లలో తలెత్తుతున్న సమస్యలు, సరఫరా నాణ్యతను మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన సాంకేతిక చర్యలపై స్థానిక సిబ్బందితో చర్చిస్తున్నారు. ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లు, విద్యుత్‌‌‌‌ లైన్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఏఈ, ఏడీఈ స్థాయి ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి వెంటనే పరిష్కరించాలని సూచిస్తున్నారు. వ్యవసాయానికి కరెంట్‌‌‌‌ సరఫరా కావడం లేదనే ఫిర్యాదులు రాకుండా అంతరాయాలను తగ్గించాలని, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని చెప్తున్నారు.

రైతులతో మాట్లాడిన సీఎండీ..

సదరన్‌‌‌‌ డిస్కం సీఎండీ జితేశ్‌‌‌‌ వి. పాటిల్‌‌‌‌ ఆదివారం షాద్‌‌‌‌నగర్‌‌‌‌, రాయికల్‌‌‌‌, రామేశ్వరం ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైతులతో మాట్లాడి విద్యుత్‌‌‌‌ సరఫరాకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లైన్‌‌‌‌మెన్లు, జూనియర్‌‌‌‌ లైన్‌‌‌‌మెన్లు, ఇతర సిబ్బందితో మాట్లాడి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. విద్యుత్‌‌‌‌ సరఫరాలో సమస్యలు తలెత్తితే వెంటనే గుర్తించి పరిష్కరించాలని సూచించారు. 

ఎల్‌‌‌‌నినో ప్రభావంతో వ్యవసాయ రంగంలో చోటుచేసుకునే మార్పులకు అనుగుణంగా రైతులు సాగు పద్ధతులను ఎంచుకోవాలని ఆయన సూచించారు. అందుబాటులో ఉన్న నీటి లభ్యతను బట్టి పంటలు సాగు చేయాలని, తక్కువ నీరు, పెట్టుబడి, శ్రమతో ఎక్కువ ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని చెప్పారు. రైతులకు మెరుగైన విద్యుత్‌‌‌‌ సేవలు అందించేందుకు విద్యుత్‌‌‌‌ శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఆయన వెంట ప్రాజెక్ట్స్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ శివాజీ  ఉన్నారు.