క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పై 15 రోజుల్లో గైడ్ లైన్స్... ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ 'హెల్త్ భరోసా'

క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పై  15 రోజుల్లో గైడ్ లైన్స్... ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ 'హెల్త్ భరోసా'
  •     బేసిక్ పేలో 1.5 % కంట్రిబ్యూషన్.. అంతే మొత్తంలో సర్కారు వాటా 
  •     ఏటా రూ. 528 కోట్లు జమ.. ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓగా ప్రభుత్వ ఉద్యోగి 
  •     ఉద్యోగ సంఘాల నేతలు, అధికారులతో భేటీలో సీఎస్ వెల్లడి

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్)ను మరో పదిహేను రోజుల్లో ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది. సచివాలయంలో సీఎస్ కె. రామకృష్ణారావు అధ్యక్షతన గురువారం జరిగిన ‘ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్’ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఉద్యోగ సంఘాల నేతలు, ఉన్నతాధికారులతో జరిగిన ఈ భేటీలో పథకం విధివిధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. 

ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ట్రస్ట్ పని చేస్తుందని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరితగతిన ఖరారు చేయాలని సీఎస్ సూచించారు. మరో15 రోజుల్లో పూర్తిస్థాయి విధివిధానాలు సిద్ధం చేసి, 45 రోజుల్లోగా పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఉద్యోగులు, పెన్షనర్ల మూల వేతనం (బేసిక్ పే) నుంచి 1.5 శాతం మొత్తాన్ని ఈ పథకం కోసం కంట్రిబ్యూషన్ గా ఇవ్వాలని ప్రతిపాదించగా, దీనికి ఉద్యోగ సంఘాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. 

ఉద్యోగులు చెల్లించే మొత్తానికి సమానంగా (మ్యాచింగ్ గ్రాంట్) అంటే మరో 1.5 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఈ ట్రస్ట్ కు జమ చేయనుంది. ఈ లెక్కన ఉద్యోగులు, ప్రభుత్వ వాటాలు కలుపుకుంటే ఏటా సుమారు రూ. 528 కోట్ల నిధులు హెల్త్ కేర్ ట్రస్ట్ కు సమకూరుతాయని అంచనా వేశారు. ఈ నిధులతో ఉద్యోగులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. క్యాష్ లెస్ వైద్య సేవల కోసం రాష్ట్రవ్యాప్తంగా అర్హత కలిగిన 515 ఆసుపత్రులను ఇప్పటికే గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.

ట్రస్ట్​లో ఉద్యోగులకే ప్రాధాన్యత

ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ నిర్వహణ బాధ్యతల్లోనూ ఉద్యోగులకు పెద్దపీట వేశారు. ట్రస్ట్ పాలకమండలిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు సభ్యులు, పెన్షనర్ల సంఘాల నుంచి ఇద్దరు సభ్యులకు చోటు కల్పించనున్నారు. అంతేకాకుండా, ఈ ట్రస్ట్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ)గా కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒకరినే నియమించనున్నారు. దీనివల్ల ఉద్యోగుల సమస్యలు, అవసరాలు నేరుగా ట్రస్ట్ దృష్టికి వస్తాయని, తద్వారా సత్వర పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ పథకంలో ఏవైనా మార్పులు, చేర్పులు చేయాల్సి వస్తే ట్రస్ట్ సమావేశంలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటారు. 

విధివిధానాలకు ప్రత్యేక కమిటీ

ఈ పథకం అమలుకు విధివిధానాలను ఖరారు చేయడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీ మరో15 రోజుల్లోగా సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తుంది.  వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు ఈ పథకం స్వరూపాన్ని వివరించగా, స్పెషల్ సీఎస్ లు సి.వి. ఆనంద్, మహేశ్ దత్ ఎక్కా, ఇతర ఉన్నతాధికారులు తమ సలహాలు, సూచనలు అందించారు. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పవర్ పాయింట్ ప్రజెంటేషన్  ద్వారా వివరించారు. 

రాష్ట్రవ్యాప్తంగా1.44 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు, పెన్షనర్లు ఉండగా, వారిపై ఆధారపడిన డిపెండెంట్లు మరో 12.84 లక్షల మంది ఉన్నట్లు లెక్కతేల్చారు. నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి మొదలుకొని గెజిటెడ్ ఆఫీసర్ల వరకు అందరూ తమ బేసిక్ పేలో నిర్ణీత మొత్తాన్ని చెల్లించడం ద్వారా ఈ పథకంలో భాగస్వాములవుతారు. ప్రస్తుతం పోలీస్ శాఖకు ‘ఆరోగ్య భద్రత’, ఎక్సైజ్ శాఖకు ‘సహాయత’ పేరుతో వేర్వేరుగా ఆరోగ్య పథకాలు అమలవుతున్నాయి. 

సమావేశానికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ అజయ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా హాజరయ్యారు. ఉద్యోగ సంఘాల తరపున టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ శ్యామ్, సచివాలయ సంఘం అధ్యక్షుడు జి. శ్రీనివాసరెడ్డి, పీఆర్టీయూ నేత దామోదర్ రెడ్డి, యుటీఎఫ్ నేత చావా రవి, టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, రెవెన్యూ అసోసియేషన్ నేత వంగా రవీందర్ రెడ్డి, పెన్షనర్ల సంఘం నేతలు లక్ష్మయ్య, ఉమాదేవి, నాగాంబ తదితరులు పాల్గొన్నారు.