ఎక్సైజ్ క‌‌‌‌మిష‌‌‌‌న‌‌‌‌ర్పై చర్యలు తీసుకోవాల్సిందే: లచ్చిరెడ్డి

ఎక్సైజ్ క‌‌‌‌మిష‌‌‌‌న‌‌‌‌ర్పై  చర్యలు తీసుకోవాల్సిందే: లచ్చిరెడ్డి
  •     డీసీ సోమిరెడ్డిని అకార‌‌‌‌ణంగా దూషించారు 
  •     పూర్తి స్థాయి విచార‌‌‌‌ణ‌‌‌‌కు ప్రభుత్వం ప్రత్యేక క‌‌‌‌మిటీని ఏర్పాటు చేయాలి
  •     త్వరలో సీఎం, మంత్రి జూపల్లి, సీఎస్​కు ఫిర్యాదు చేస్తం
  •     తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.ల‌‌‌‌చ్చిరెడ్డి, సెక్రట‌‌‌‌రీ జ‌‌‌‌న‌‌‌‌ర‌‌‌‌ల్ వొడ్నాల రాజ‌‌‌‌శేఖ‌‌‌‌ర్‌‌‌‌ ప్రకటన
  •     ‘ఆకలితోనైనా చస్తాం కానీ ఆత్మాభిమానం వదులుకోలేం’ అని.. ఉద్యోగాన్ని వీడాలని నిర్ణయించుకున్నట్లు సోమిరెడ్డి ప్రకటన

హైదరాబాద్, వెలుగు: నిజామాబాద్ డివిజన్ ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డిని అదే శాఖకు చెందిన కమిషనర్ హరికిరణ్ అకారణంగా దూషించడాన్ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ తీవ్రంగా ఖండించారు. తోటి ఉన్నతాధికారి అని కూడా చూడ కుండా పరుష పదజాలంతో అవమానపరచడం అత్యంత గర్హనీయమని వారు మండిపడ్డారు. బాధ్యుడైన కమిషనర్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒక ఉన్నతస్థాయి అధికారి కింది స్థాయి సిబ్బందిని ఇబ్బంది పెట్టడం సరికాదని, దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పూర్తి స్థాయి విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఆత్మగౌరవంతో పనిచేసే ఉద్యోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం సమంజసం కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని, ఉద్యోగ లోకం అంతా సోమిరెడ్డికి అండగా ఉంటుందని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వ పెద్దలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి తగిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. శుక్రవారం జరిగిన ఈ ఉదంతంలో కమిషనర్ తన పరిధిని దాటి వ్యవహరించారని జేఏసీ నాయకులు ఆరోపించారు. తోటి అధికారులు, సిబ్బంది ముందే సోమిరెడ్డిని ‘వెధవ, ఇడియట్’ అంటూ తీవ్రపదజాలంతో దూషించారని, ఇది ఒక ఉన్నత అధికారి సంస్కారానికి విరుద్ధమని ధ్వజమెత్తారు. ఈ అవమానాన్ని భరించలేక సోమిరెడ్డి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆస్పత్రి పాలు కావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏండ్లుగా ఎక్సైజ్ శాఖలో ఉత్తమ అధికారిగా సేవలందిస్తున్న వ్యక్తిని అకారణంగా నిందించాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నించారు. ఏ ఒక్క పైఅధికారికి కూడా ఉద్యోగుల ఆత్మగౌరవంతో, వారి జీవితాలతో ఆడుకునే హక్కు లేదని జేఏసీ నేతలు హెచ్చరించారు. తప్పు చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి తప్ప, ఇలా నోరు పారేసుకుని భయభ్రాంతులకు గురిచేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ ఘటన అధికారుల మధ్య ఉండాల్సిన సమన్వయాన్ని దెబ్బతీస్తుందని, తక్షణమే కమిషనర్‌పై క్రమశిక్షణా చర్యలు చేపట్టి ఉద్యోగుల్లో ధైర్యాన్ని నింపాలని వారు విజ్ఞప్తి చేశారు.


చైతన్యం చచ్చిపోయిన శాఖలో పనిచేసినందుకు సిగ్గుపడుతున్నా: సోమిరెడ్డి

మరోవైపు సోమిరెడ్డి తన ఆవేదనను వ్యక్తపరుస్తూ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ‘ఆకలితోనైనా చస్తాం కానీ ఆత్మాభిమానం వదులుకోలేం’ అన్న కాళోజీ మాట లను గుర్తు చేసుకుంటూ, తాను ఉద్యోగాన్ని వీడాలని నిర్ణయించుకున్నట్టు ఆయన వెల్లడించారు. చేయని తప్పుకు అందరి ముందు తిడుతుంటే తన సున్నిత మనస్తత్వం ఆ మాటలను స్వీకరించలేకపోయిందని, ఎదురు చెప్పినందుకు కమిషనర్ ఈగో హర్ట్ అయి తనను మరింతగా వేధించారని ఆయన ఆవేదన చెందారు. పది నిమిషాల పాటు సాగిన ఆ దూషణ పర్వం తనను తీవ్ర మానసిక వ్యధకు గురి చేసిందని, అందుకే ఆస్పత్రి పాలయ్యానని సోమిరెడ్డి పోస్టులోపేర్కొన్నారు. ప్రశ్నిద్దాం అని తోటి ఉద్యోగులను కోర గా మౌనంగా భయంగా చూడటంతో చైతన్యం చచ్చిపోయిన శాఖలో పనిచేసినందుకు సిగ్గుపడుతున్నానని, ఆత్మాభిమానం లేని చోట ఉద్యోగం చేయడం కంటే తప్పుకోవడమే మిన్న అని ఆయన పేర్కొన్నారు. ఒక నిజాయతీ గల అధికారి ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం యావత్ ప్రభుత్వ వ్యవస్థకు సిగ్గుచేటని జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు.

కఠిన నిబంధనలు రూపొందించాలి

ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ఉద్యో గుల జేఏసీ ప్రతినిధులు త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్ రామకృష్ణారావును కలిసి ఫిర్యాదు చేయనున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఉన్నతాధికారుల తీరులో మార్పు రావాలని, ఉద్యోగుల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ప్రభుత్వం కఠిన నిబంధ నలు రూపొందించాలని కోరారు. ఆబ్కారీ శాఖ కమిషనర్ తీరుపై పలువురు ఉద్యోగు లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ హోటళ్లలో మద్యం సప్లయర్లతో భేటీ అవుతు న్నారని, ప్రతినెలా ఆఫీస్ ఖర్చుల పేరుతో రూ.5 లక్షల దాకా అనవసర బిల్లులు వేస్తు న్నారనే ఆరోపణలు హరి కిరణ్​పై ఉన్నాయి.