కాళేశ్వరం.. రాష్ట్రానికి శనేశ్వరం: ఎక్స్​పర్ట్స్

కాళేశ్వరం..  రాష్ట్రానికి శనేశ్వరం: ఎక్స్​పర్ట్స్

బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు శనేశ్వరంలా తయారైందని జలవనరుల నిపుణులు, మేధావులు విమర్శించారు. అనాలోచిత ప్లాన్​తో ఆగమేఘాల మీద నిర్మించి.. వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు నిర్మించి సీఎం కేసీఆర్ పెద్ద తప్పు చేశారన్నారు. ఇది రాష్ట్ర ఖజానాకు గుదిబండగా మారిందని ఫైర్ అయ్యారు. 

బషీర్​బాగ్ ప్రెస్​క్లబ్​లో  కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ అంశంపై తెలంగాణ సమాఖ్య, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జలవనరుల నిపుణులు దొంతుల లక్ష్మినారాయణ, బీవీ సుబ్బారావు, సుప్రీంకోర్టు సీనియర్ లాయర్​  నిరూప్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్  పాశం యాదగిరి, జర్నలిస్టు సంఘాల నాయకులు మామిడి సోమయ్య,  కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, కరుణాకర్ దేశాయ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. 

కేసీఆర్ చీఫ్ ఇంజినీర్ అవతారమెత్తి తుమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు సైట్ మార్చి మొదటి తప్పు చేశారని అన్నారు. ప్రాణహిత- చేవెళ్ల పేరుతో ఉన్న ప్రాజెక్టు పేరు మార్చి, కేవలం 30 వేల కోట్లతో పూర్తి కావలసిన ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రీడిజైన్ పేరుతో లక్షా 30 వేల కోట్లకు పెంచారని తెలిపారు. నాలుగేండ్లకే పిల్లర్లు కుంగిపోయాయంటే, ఈ  బ్యారేజ్ ఎక్కువ కాలం నిలవదన్నారు. ఇటీవల తాము మేడిగడ్డను సందర్శించినప్పుడు నాణ్యతాలోపం కనిపించిందని తెలిపారు.