హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్త చేయూత సామాజిక భద్రతా పింఛన్ల దరఖాస్తుల వెరిఫికేషన్ గడువును ప్రభుత్వం పొడిగించింది. అర్హులైన లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ ముగింపు తేదీని ఈ నెల 30 వరకు పెంచుతూ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని సెర్ప్ సీఈవో దివ్య తాజాగా సర్క్యులర్ జారీ చేశారు. తొలుత నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల పరిశీలన గడువు 25వ తేదీతో ముగియాల్సి ఉంది.
అయితే, క్షేత్రస్థాయి అధికారులు గణేశ్ నిమజ్జన బందోబస్తు ఏర్పాట్లు, ఎస్ఐఆర్ విధులు, ఇతర అత్యవసర బాధ్యతల్లో బిజీగా ఉండటంతో నిర్ణీత సమయంలోగా ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో గడువు పొడిగించాలని క్షేత్రస్థాయి నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి. ఫీల్డ్ అధికారుల వినతులను పరిగణనలోకి తీసుకున్న సెర్ప్.. వెరిఫికేషన్ గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.
పొడిగించిన గడువులోగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వెరిఫికేషన్‌ను వంద శాతం పూర్తి చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ, మున్సిపల్ కమిషనర్లు, డీఆర్డీవోలు, డీఎంహెచ్‌వోలు, ఎంపీడీవోలను సీఈవో ఆదేశించారు. అర్హులైన ప్రతి పేదవాడికి పింఛను అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.
