
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రూ.11,051 కోట్ల రెవెన్యూ లోటును రూ.33,415 కోట్ల ద్రవ్య లోటును ఎదుర్కొంటున్నది. ప్రధానంగా ఆదాయ అంచనాలకు తగ్గట్టుగా రాబడి లేకపోవడం, అప్పులపై అధిక వడ్డీ చెల్లింపులు, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లపై ఎక్కువగా ఖర్చు చేయడంతో ఈ లోటు ఏర్పడింది. కాగ్ తాజాగా రిలీజ్ చేసిన ఆగస్టు రిపోర్టులో ఈ అంశాలు వెల్లడించింది.
ఆగస్టు 2025 నాటికి, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.63,219.46 కోట్ల రెవెన్యూ రాబడి వచ్చింది, ఇది అంచనాలో 27.52 శాతం. ఇందులో పన్నుల రాబడి రూ.59,967.59 కోట్లు, పన్నేతర రాబడి రూ.1,578.44 కోట్లు, గ్రాంట్-ఇన్-ఎయిడ్, విరాళాల ద్వారా రూ.1,673.43 కోట్లు లభించాయి. మొత్తం రాబడిలో, అప్పులతో రూ.33,415.15 కోట్లు సమకూర్చుకున్నారు.
ఖర్చుల విషయానికి వస్తే, రెవెన్యూ వ్యయంలో జీతాలు, వేతనాల కోసం రూ.20,141.33 కోట్లు, పెన్షన్ల కోసం రూ.7,701.78 కోట్లు, వడ్డీ చెల్లింపుల కోసం రూ.11,447 కోట్లు ఖర్చు చేశారు. క్యాపిటల్ ఖర్చుల కింద రూ.13,921.17 కోట్లు వ్యయం చేశారు. అప్పులు, అధిక వ్యయాల కారణంగానే రాష్ట్రం ప్రస్తుత ఆర్థి క లోటును ఎదుర్కొంటున్నది.