ఏరువాకకు రెడీ... దుక్కులు దున్ని విత్తనాలు వేయడానికి రైతుల సన్నాహాలు

ఏరువాకకు రెడీ... దుక్కులు దున్ని విత్తనాలు వేయడానికి రైతుల సన్నాహాలు
  • ఎరువులు, విత్తనాల సరఫరాపై వ్యవసాయ శాఖ అప్రమత్తం
  • అందుబాటులో 2.45 లక్షల టన్నుల యూరియా బఫర్ స్టాక్
  • 2.40 కోట్ల కాటన్ సీడ్ ప్యాకెట్లు సిద్ధం చేసిన కంపెనీలు
  • ముందస్తు వర్షాలతో రైతుల్లో ఉత్సాహం 
  • నకిలీ విత్తనాలు, ఎరువులపై ప్రత్యేక నిఘా
  • వానాకాలం సాగు అంచనా 1.34 కోట్ల ఎకరాలు 
  • అవసరానికి తగ్గట్టు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసిన అధికారులు   

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వానాకాలం సీజన్‌‌ సాగుకు రంగం సిద్ధమైంది. ముందస్తుగా వర్షాలు ప్రారంభం కావడం, రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు నెలకొనడంతో రైతాంగం ఏరువాకకు సన్నాహాలు చేసుకుంటున్నరు. దుక్కులు దున్నడం, పొలాలను సాగుకు సిద్ధం చేయడం, విత్తనాలు, ఎరువుల సమీకరణ వంటి పనులు జోరందుకుంటున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ శాఖ  ఏర్పాట్లు చేపట్టింది. జిల్లాల వారీగా నిల్వలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తోంది. 

రాష్ట్రవ్యాప్తంగా రైతు సేవా కేంద్రాలు, సహకార సంఘాలు, ప్రైవేట్ డీలర్ల ద్వారా వ్యవసాయ విత్తనాలు, ఎరువుల పంపిణీకి ప్రణాళిక రూపొందించింది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రైతులకు సకాలంలో అందేలా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రీ-మాన్సూన్ వర్షాలు కురవడంతో పొలాల్లో తేమ పెరిగింది. రుతుపవనాలు పూర్తిస్థాయిలో రాష్ట్రాన్ని తాకిన వెంటనే విత్తనాలు వేయాలని రైతులు ఎదురు చూస్తున్నారు. వ్యవసాయ శాఖ మాత్రం వర్షపాతం పరిస్థితులను పరిశీలించి శాస్త్రీయ సూచనల మేరకు విత్తనాలు వేయాలని సూచిస్తోంది. ముఖ్యంగా పత్తి, కంది, సోయాబీన్, పెసర వంటి వర్షాధార పంటల సాగుకు ఇది అనుకూల సమయమని అధికారులు చెబుతున్నారు.   

సాగు లక్ష్యం 1.34 కోట్ల ఎకరాలు 

ఈ వానాకాలం సీజన్‌‌లో రాష్ట్రవ్యాప్తంగా కోటి 34 లక్షల 66 వేల ఎకరాల్లో పంటల సాగు జరిగేలా వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందించింది. ఇందులో వరి, పత్తి ప్రధాన పంటలుగా నిలవనున్నాయి. 66 లక్షల ఎకరాల్లో వరి, 52 లక్షల ఎకరాల్లో పత్తి సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. కంది, సోయాబీన్, మొక్కజొన్న, పెసర్లు, మినుముల వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వాతావరణ మార్పులు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గుచూపాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. 

సాధారణ రకం పత్తికి క్వింటాల్‌‌కు రూ.8,267, లాంగ్ స్టేపుల్ రకానికి రూ.8,667 మద్దతు ధర లభించనుంది. దీంతో నల్లరేగడి భూములు అధికంగా ఉన్న జిల్లాల్లో పత్తి సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా పత్తి సాగు కొంత మేరకు తగ్గినా, ఎల్​నినో వంటి తాజా పరిస్థితుల నేపథ్యంలో మినిమం గ్యారెంటీగా పేరున్న  పత్తికి రైతులు మొగ్గు చూపుతున్నారు. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం, ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి సాధారణంగా వస్తుండగా, అనుకూల పరిస్థితుల్లో నల్లరేగడి భూముల్లో 20 క్వింటాళ్లకు పైగా దిగుబడులు సాధ్యమవుతున్నాయని అధికారులు చెప్తున్నారు. 

2.40 కోట్ల కాటన్ సీడ్ ప్యాకెట్లు సిద్ధం

రాష్ట్రంలో 52 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకు సుమారు 1.04 కోట్ల కాటన్ సీడ్ ప్యాకెట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అవసరానికి రెట్టింపు స్థాయిలో 2.40 కోట్ల ప్యాకెట్లను సిద్ధం చేశారు. ఒక్కోటి 450 గ్రాముల ప్యాకెట్‌‌ను రూ.901 ధరకు ప్రైవేట్ కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. రైతులకు విత్తనాల కొరత తలెత్తకుండా ముందస్తుగానే నిల్వలు ఏర్పాటు చేశారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ, జాతీయ విత్తన సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు కలిసి విత్తనాల సరఫరా బాధ్యతలు నిర్వహిస్తున్నాయి. వరి, మొక్కజొన్న, సోయాబీన్ తదితర పంటలకు అవసరమైన 16 లక్షల క్వింటాళ్లకు పైగా విత్తనాలను అందుబాటులోకి తెస్తున్నారు. పచ్చిరొట్ట విత్తనాలను 50 శాతం సబ్సిడీతో రైతులకు పంపిణీ చేయనున్నారు. 

2.45 లక్షల టన్నుల యూరియా 

వానాకాలం సాగు కోసం 12 లక్షల టన్నుల వరకు యూరియా అవసరమవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కేంద్రం ఇప్పటికే 10 లక్షల టన్నుల యూరియాను కేటాయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2.45 లక్షల టన్నులకు పైగా యూరియా బఫర్ స్టాక్ ఉంది. అదనంగా నెలవారీ ప్రణాళిక ప్రకారం కేంద్రం నుంచి యూరియా సరఫరా కొనసాగనుంది. డీఏపీ, ఎన్‌‌పీకే, ఎంఓపీ, ఎస్‌‌ఎస్‌‌పీ తదితర ఎరువుల నిల్వలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల నిల్వలు తక్కువగా ఉండటంతో వాటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించారు. యూరియా సరఫరాలో అంతరాయం రాకుండా కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతర సమన్వయం కొనసాగిస్తోంది. అయితే, కేంద్రం నుంచి సకాలంలో యూరియా సరఫరా కాకపోతే ఇబ్బంది తప్పదని తెలుస్తోంది. 

నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం

వానాకాలం సీజన్ ప్రారంభం కాగానే నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువుల వ్యాపారం పెరిగే అవకాశాలు ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాల వారీగా ప్రత్యేక టాస్క్‌‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రైతులు తప్పనిసరిగా బిల్లు తీసుకుని, సీల్డ్ ప్యాకెట్లలో ఉన్న విత్తనాలనే కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నకిలీ విత్తనాల రవాణాను అడ్డుకునే చర్యలు చేపడుతున్నారు.