కొత్త ట్రిబ్యునల్‌‌కే మొగ్గుచూపుతున్న తెలంగాణ

కొత్త ట్రిబ్యునల్‌‌కే మొగ్గుచూపుతున్న తెలంగాణ
  • బోర్డుల పరిధిపై గెజిట్‌ను స్టడీ చేస్తున్నం
  • ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇస్తాం
  • 2014 జూన్ 2కు ముందు ప్రారంభించిన వాటి వివరాలు ఇవ్వం
  • ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్

హైదరాబాద్‌‌, వెలుగు: కృష్ణా జలాల పునఃపంపిణీ కోసం ఇంటర్‌‌ స్టేట్‌‌ వాటర్‌‌ డిస్ప్యూట్స్‌‌ యాక్ట్‌‌–1956లోని సెక్షన్‌‌ -3 కింద కొత్త ట్రిబ్యునల్‌‌ ఏర్పాటుకే తాము మొగ్గు చూపుతున్నామని నీటి పారుదల శాఖ ప్రత్యేక సీఎస్‌‌ రజత్‌‌కుమార్‌‌ అన్నారు. సోమవారం జలసౌధలో ఈఎన్సీ మురళీధర్‌‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర జలశక్తి శాఖ తీసుకొచ్చిన కృష్ణా, గోదావరి రివర్‌‌ బోర్డుల జ్యూరిస్‌‌డిక్షన్‌‌పై స్టడీ చేస్తున్నామని తెలిపారు. పరిపాలన, సాంకేతిక, లీగల్‌‌ అంశాలపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. ఆ తర్వాతే జ్యూరిస్‌‌డిక్షన్‌‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణకు కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా తేల్చేవరకు రెండు రాష్ట్రాలకు 50 శాతం చొప్పున నీటి పంపకాలు చేయాలన్నారు. 64:36 నిష్పత్తిలో నీటి పంపకాలు కేవలం ఒక్క సంవత్సరం కోసం చేసుకున్నవేనని, వాటినే కొనసాగిస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. గెజిట్‌‌లో పేర్కొన్నట్టుగా ప్రాజెక్టుల డీపీఆర్‌‌లు ఇచ్చేందుకు సర్కార్ ప్రయత్నిస్తుందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 2014 జూన్‌‌ 2 నాటికే ప్రారంభించిన ప్రాజెక్టుల డీపీఆర్‌‌లు అడిగే అధికారం కేఆర్‌‌ఎంబీకి లేదన్నారు. అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ పరిధిలోకి వచ్చే ప్రాజెక్టుల డీపీఆర్‌‌లు సమర్పిస్తామని చెప్పారు. తెలంగాణకు కృష్ణా జలాల్లో 560 టీఎంసీల వాటా దక్కాల్సి ఉందని, దాని కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. రెండో అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ భేటీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌‌ షెకావత్‌‌ సూచన మేరకు సుప్రీంకోర్టులో ఉన్న కేసును విత్‌‌డ్రా చేసుకున్నామని తెలిపారు. దేవాదుల, పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల స్కీమ్​లన్నీ పాత ప్రాజెక్టులేనని చెప్పారు. ప్రధాని మోడీ కూడా మహబూబ్‌‌నగర్‌‌ ఎన్నికల ప్రచార సభలో పాలమూరు ప్రాజెక్టు గురించి ప్రస్తావించారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలోనే చేపట్టినవని, కొన్నింటి డిజైన్‌‌లలో మార్పులు చేశామే తప్ప కొత్తవి లేవన్నారు. ఈ విషయాలన్ని కేంద్రానికి వివరిస్తామన్నారు.