హనుమకొండ, వెలుగు: వేసవిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. హనుమకొండ విద్యుత్ భవన్ లో గురువారం ఆపరేషన్, ఫైనాన్స్ వింగ్ ఆఫీసర్లతో వివిధ అంశాలపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ఫీడర్లకు మార్చి నెలాఖరు వరకు జీఐఎస్ మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు.
పిడుగులతో ట్రాన్స్ఫార్మర్లు దెబ్బ తినకుండా 2,337 చోట్ల ఏర్పాట్లు చేశామని, మిగిలిన వాటిని మార్చి వరకు పూర్తి చేయాలని సూచించారు. జాయింట్ ఫీడర్లను 506 బ్రేకర్లతో వేరు చేశామని తెలిపారు. సింగిల్ ఫేజ్ ఏబీ స్విచ్ పనులను జూన్ వరకు కంప్లీట్ చేయాలని సూచించారు. ట్రాన్స్ఫార్మర్ల ఫెయిల్యూర్లు తగ్గించాలని, రిపేర్లు పెంచాలన్నారు.
ఓవర్ లోడ్ ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీ పెంచాలన్నారు. పెండింగ్ లో ఉన్న ఇంటర్ లింకింగ్ లైన్స్ ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలన్నారు. కలెక్షన్లు వంద శాతం జరిగేలా క్షేత్ర స్థాయి సిబ్బంది చొరవ చూపాలని సూచించారు. డైరెక్టర్లు వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, సీఈలు రాజు చౌహాన్, అశోక్, శ్రవణ్ కుమార్, సీజీఎంలు రవీంద్రనాథ్, చరణ్ దాస్, కిషన్ పాల్గొన్నారు.
