- యూనిఫాం సరఫరాకు వచ్చే నెల15 వరకు గడువు
- రూ.687. 78 కోట్లకు టెండర్లు ఖరారు
- దక్కించుకున్న ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు
- టెస్కోకు 25 శాతం యూనిఫాం క్లాత్ సరఫరా బాధ్యత
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న స్టూడెంట్లకు త్వరలోనే యూనిఫాంలు, స్కూల్ బ్యాగులు, ఇతర వస్తువులు అందించనున్నారు. వీటిని సరఫరా చేసేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. యూనిఫాంలు, స్కూల్ బ్యాగులు, బూట్లు, సాక్సులు, బెడ్డింగ్ సామగ్రి, ట్రంక్ పెట్టెలు, భోజనం చేసే ప్లేట్లు, స్టేషనరీ, ఇతర వస్తువుల కొనుగోలుకు సంబంధించి రూ.687.78 కోట్ల టెండర్లను ఈ–ప్రొక్యూర్‌మెంట్ విధానంలో అధికారులు ఖరారు చేశారు.
అన్ని వస్తువులను ఈ నెల 31లోగా సరఫరా చేయాలని ఆయా కంపెనీలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే యూనిఫాం క్లాత్ సరఫరా చేయడం, కుట్టడం లేట్ అవుతోందని కంపెనీలు పేర్కొన్నాయి. దీంతో వచ్చే నెల 15 వరకు యూనిఫాంలు సరఫరా చేసేందుకు గడువు పెంచినట్లు అధికారులు చెప్తున్నారు. గురుకుల టెండర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని, ఈ–ప్రొక్యూర్‌మెంట్ నిబంధనలకు అనుగుణంగానే అన్ని నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.
ముందస్తు ప్రణాళికతో టెండర్లు..
అకడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపు అన్ని గురుకులాలు, స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని 18 లక్షల మంది స్టూడెంట్స్‌కు అన్ని వస్తువులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్ 2న ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్(పీఎంయూ) రాష్ట్ర ఈ–ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌లో తొమ్మిది విభాగాలకు జాతీయ స్థాయి టెండర్లను ఆహ్వానించింది. యూనిఫాం క్లాత్ నుంచి స్టేషనరీ వరకు విద్యార్థుల దినచర్యకు అవసరమైన అన్ని వస్తువులను ఇందులో చేర్చారు. ఏప్రిల్ 8న ప్రీ -బిడ్ సమావేశం నిర్వహించి సంస్థల అభిప్రాయాలను స్వీకరించారు.
ఈ మీటింగ్‌లో బిడ్డర్లు పలు సూచనలు చేయడంతో సవరణలు చేసి ఎక్కువ సంస్థలు టెండర్లలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నారు. టెండర్లను ఖరారు చేసే ముందు సాంకేతిక అర్హతలను పరిశీలించారు. ఉత్పత్తి సామర్థ్యం, నాణ్యత ప్రమాణాలు, గత అనుభవం, సరఫరా సామర్థ్యం వంటి అంశాలను పరిశీలించి అర్హత సాధించిన సంస్థల ఫైనాన్షియల్ బిడ్స్‌ను మాత్రమే అధికారులు తెరిచారు. అనంతరం వస్తువుల వారీగా తక్కువ ధర కోట్ చేసిన సంస్థలను ఎంపిక చేశారు. అవసరమైన చోట చర్చలు జరిపి ప్రభుత్వానికి ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారు.
మహిళల ఉపాధికి చేయూత..
యూనిఫాంలు కుట్టే పనులను ప్రభుత్వ టైలర్స్ ఫెడరేషన్‌కు అప్పగించడం ద్వారా 14 వేల మందికి, మహిళ సంఘాలకు అప్పగించడం ద్వారా లక్షల మంది మహిళలకు ఉపాధి లభించనుంది. చేనేత కార్మికులు, మహిళా స్వయం సహాయక సంఘాలు, తోలు పరిశ్రమకు కూడా ఈ కొనుగోళ్ల ద్వారా పనులు లభించనున్నాయి. జిల్లా స్థాయిలో అధికారుల పర్యవేక్షణలో సామగ్రిని తనిఖీ చేసి విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు.
గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికీ ఒకే నాణ్యతతో కూడిన వస్తువులు అందించడం, ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడం, స్థానిక పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించడం, మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రక్రియను అమలు చేస్తోందని అధికారులు చెప్తున్నారు. టెండర్లు పారదర్శకంగా నిర్వహించి నాణ్యమైన వస్తువులను తక్కువ ధరలకు సమకూర్చినట్లు స్పష్టం చేస్తున్నారు.
ప్రభుత్వరంగ సంస్థలకు ప్రాధాన్యం
వస్తువుల సరఫరా విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ(టెస్కో), తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్(టీజీఎల్‌ఐపీసీ), తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్(టీజీటీపీసీ)కు పలు టెండర్లు ఖరారు చేశారు. యూనిఫాంలు కుట్టేందుకు సరఫరా చేసే క్లాత్‌లో 25 శాతం టెస్కో సరఫరా చేయనుంది. అదనంగా రూ.70.86 కోట్ల విలువైన పనులను కూడా ఈ సంస్థకు అప్పగించారు. 56 లక్షల మీటర్ల క్లాత్, 6.49 లక్షల దుప్పట్ల సరఫరా బాధ్యతను కూడా ఈ సంస్థ నిర్వహించనుంది. బెల్ట్‌లు, టైలు, ఐడీ కార్డుల తయారీని టీజీఎల్‌ఐపీసీకి అప్పగించగా, నోట్‌బుక్స్ సరఫరాను టీజీటీపీసీ ద్వారా చేపట్టనున్నారు.
యూనిఫాం క్లాత్ సరఫరాలో మఫత్‌లాల్ ఇండస్ట్రీస్‌కు రూ.298.10 కోట్ల విలువైన టెండర్ దక్కింది. 2.44 కోట్ల మీటర్ల క్లాత్‌ను ఈ సంస్థ సప్లై చేయనుంది. స్కూల్ బ్యాగులు, బూట్లు, సాక్సుల సరఫరాకు రూ.263.47 కోట్ల పనులు కూడా అదే సంస్థకు లభించాయి. 11.39 లక్షల బ్యాగులు, 28.35 లక్షల బ్లాక్ షూలు, 7.74 లక్షల వైట్ షూలు, 67 లక్షల జతల సాక్సులు సరఫరా చేయనుంది. వరల్డ్ ఫా ఎంటర్‌ప్రైజెస్‌కు ప్లేట్లు, గ్లాసులు, బౌల్స్, స్పూన్ల సప్లై బాధ్యతలు అప్పగించగా, చింతామణి పార్శ్వనాథ్ ఎంటర్‌ప్రైజెస్‌కు ట్రంక్ బాక్సుల సరఫరా పనులు దక్కాయి. బెడ్డింగ్ సామగ్రి సప్లై కూడా పోటీ టెండర్ల ద్వారానే ఖరారైంది.
