బీఆర్ఎస్​కు తాటికొండ రాజయ్య రాజీనామా

బీఆర్ఎస్​కు తాటికొండ రాజయ్య రాజీనామా
  • కేసీఆర్​కు రిజైన్ లెటర్ పంపిన మాజీ డిప్యూటీ సీఎం
  • అవమానాలు భరించలేకనే పార్టీని వీడుతున్నట్టు ప్రకటన 
  • కొత్త సర్కార్​ను కూలుస్తామనడం బాధించిందని వ్యాఖ్య
  • కాంగ్రెస్ స్టేట్ ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షీతో భేటీ

జనగామ/స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య బీఆర్ఎస్​కు రాజీనామా చేశారు. గత కొన్ని నెలలుగా అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీకి గుడ్​బై చెప్పారు. ఈ మేరకు శనివారం తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్​కు పంపించారు. గుర్తింపు లేకపోవడంతో పాటు అవమానాలు భరించలేకనే పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. కాగా, బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కొద్దిసేపటికే కాంగ్రెస్​స్టేట్ ఇన్ చార్జ్​దీపాదాస్​మున్షీని రాజయ్య కలిశారు. ఆయన ఈ నెల 10న కాంగ్రెస్ లో చేరనున్నారని, వరంగల్​ఎంపీ టికెట్​ఆశిస్తున్నారని తెలిసింది.  

కాంగ్రెస్ నుంచే ప్రస్థానం ప్రారంభం.. 

1997లో కాంగ్రెస్​పార్టీతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రాజయ్య.. 2009లో తొలిసారి స్టేషన్​ ఘన్​పూర్​నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.  తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో తన పదవికి, కాంగ్రెస్​కు రాజీనామా చేసి 2011లో బీఆర్ఎస్ (టీఆర్ఎస్)లో చేరారు. 2012లో వచ్చిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. 2014లోనూ ఎమ్మెల్యేగా గెలిచి  తొలి తెలంగాణ సర్కారులో ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టారు. అయితే ఏడాది గడవక ముందే 2015 జనవరి 25న రాజయ్యను పదవి నుంచి తొలగించారు. 2018లోనూ ఆయన బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ మొన్నటి ఎన్నికల్లో రాజయ్యను పక్కన పెట్టిన బీఆర్ఎస్ అధిష్టానం.. కడియం శ్రీహరికి టికెట్​ఇచ్చింది. రాజయ్యను రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినా ఆయన అసంతృప్తితోనే ఉన్నారు. లోక్ సభ టికెట్ ఆశించిన రాజయ్యకు బీఆర్ఎస్ పెద్దల నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడం, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్యకు టికెట్​ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతుండడంతో పార్టీ మారాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎలక్షన్ల​టైమ్ నుంచే కాంగ్రెస్​పెద్దలతో టచ్​లో ఉంటున్న  రాజయ్య.. ఇటీవల వరంగల్​ఇన్​చార్జ్​మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారని, సీఎం రేవంత్​ రెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేయడంతో బీఆర్ఎస్​కు గుడ్​ బై చెప్పారని ఆయన అనుచరులు చెబుతున్నారు. 

అవమానాలు తట్టుకోలేకనే: రాజయ్య

బీఆర్ఎస్ లో అవమానాలు తట్టుకోలేకనే రాజీనామా చేశానని రాజయ్య తెలిపారు. రాజీనామా చేసిన అనంతరం ఆయన‘ వెలుగు’తో ఫోన్​ లో మాట్లాడారు. ప్రజాస్వామ్యయుతంగా ఏర్పాటైన కాంగ్రెస్​ప్రభుత్వాన్ని కూల్చుతామనడం తనను బాధించిందని పేర్కొన్నారు. ‘‘బీఆర్ఎస్ లో అడుగడుగునా అవహేళనలు చేశారు. పార్టీకి ప్రజల్లో ఎక్కడా సానుకూలత లేదు. నన్ను డిప్యూటీ సీఎం పదవి నుంచి ఎందుకు తొలగించారో ఇప్పటికీ సమాధానం లేదు. 

హెల్త్​ యూనివర్సిటీ ఏర్పాటు విషయంలోనూ అవమానించారు. స్థాయికి తగ్గట్టు మాట్లాడాలని హెచ్చరించారు. నా డిప్యూటీ సీఎం పదవి తీసేసి కడియంకు ఇచ్చారు. ఆయనను మంత్రిని చేయాలనుకుంటే ఎమ్మెల్సీ చేసి ఇస్తే సరిపోయేది. కానీ నా ఎమ్మెల్యే టికెట్ కూడా ఆయనకే ఇచ్చారు. నియోజకవర్గంలో ఎక్కడ తిరిగినా ఆయన దగ్గర పనిచేస్తవా అని అడుగుతున్నారు. నాకు బీఆర్ఎస్​పెద్దలు ఇచ్చిన హామీల అమలు ఊసే లేకుండాపోయింది. పైసలు పట్టుకుని పోయినోళ్లకు విలువ ఉన్నది. ఎంపీ టికెట్​పై పాజిటివ్​గా లేరు. పైగా కడియం బిడ్డకు ఇస్తమని అంటున్నరు. ఇన్ని అవమానాల మధ్య బీఆర్​ఎస్ లో ఉండొద్దని కఠిన నిర్ణయం తీసుకున్నాను’’  అని తెలిపారు.