తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్–2025 వేడుక: షూటింగ్‌‌‌‌‌‌‌‌ల కోసం సింగిల్ విండో విధానం: సీఎం రేవంత్

తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్–2025 వేడుక: షూటింగ్‌‌‌‌‌‌‌‌ల కోసం సింగిల్ విండో విధానం: సీఎం రేవంత్
  • ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లోనే అన్ని శాఖల నుంచి అనుమతులు: సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌
  • గ్లోబల్.. డిజిటల్ ఫిలిం హబ్‌‌‌‌‌‌‌‌గా హైదరాబాద్.. హాలీవుడ్, బాలీవుడ్​ అందరూ ఇక్కడికే రావాలి
  • సినీ రంగం అభివృద్ధికి ప్రభుత్వ సహకారం ఉంటుంది
  • సామాజిక బాధ్యతతో తీసే చిత్రాలకు  ప్రాధాన్యత.. ప్రోత్సాహకాలు ఇస్తామని వెల్లడి
  • తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్–2025 వేడుకలో సీఎం ప్రసంగం

హైదరాబాద్​, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను కేవలం ఐటీ, ఫార్మా రంగాలకే కాకుండా, అంతర్జాతీయ సినీ గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి  స్పష్టం చేశారు. షూటింగ్‌‌‌‌‌‌‌‌ల కోసం సింగిల్ విండో విధానం ద్వారా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లోనే అనుమతులు ఇస్తామని చెప్పారు. నెట్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌లాంటి సంస్థలు రావడంతో హాలీవుడ్ కళ మన నగరానికి వచ్చిందని అన్నారు. 

గురువారం హెచ్ఐసీసీలో జరిగిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ - 2025 వేడుకలో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు. అవార్డులను ప్రదానం చేసిన అనంతరం మాట్లాడుతూ.. సినిమా షూటింగ్స్‌‌‌‌‌‌‌‌ కోసం నిర్మాతలు ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని వెల్లడించారు. దీనికోసం ప్రత్యేకంగా ‘సింగిల్ విండో’ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్టు  ప్రకటన చేశారు. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకుంటే, అన్ని శాఖల అనుమతులు ఒకే చోట లభించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

ఈ బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అప్పగించినట్టు చెప్పారు.   సామాజిక బాధ్యతతో తీసే చిత్రాలకు ప్రభుత్వం ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని  స్పష్టం చేశారు. పేదల సమస్యలను ప్రతిబింబించే చిత్రాలకు, కళాకారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేస్తామని చెప్పారు.  నెట్‌‌ఫ్లిక్స్ తన జీసీసీ సెంటర్‌‌ను హైదరాబాద్‌‌లో ప్రారంభించడంతో హాలీవుడ్ మన ఇంటికి వచ్చినట్లయిందని చెప్పారు. 

ఐమాక్స్, డాల్బీ అట్మాస్ లాంటి అత్యాధునిక సాంకేతికతలో మన నగరం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సినీ రంగంలో మార్పులు వస్తున్నాయని, దానికి తగ్గట్టుగా మనం సిద్ధం కావాలని కోరారు. ఏఐ లాంటి సరికొత్త టెక్నాలజీని కూడా సినీ నిర్మాణంలో వాడుకోవడానికి ప్రభుత్వం తగిన తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. భవిష్యత్తులో హైదరాబాద్ ఒక గొప్ప డిజిటల్ ఫిలిం సిటీగా అవతరిస్తుందని  ధీమా వ్యక్తం చేశారు. నిర్మాతలు ఎలాంటి ఆందోళన చెందకుండా ఇక్కడ పెట్టుబడులు పెట్టి అద్భుతమైన చిత్రాలను నిర్మించాలని కోరారు.

హైదరాబాద్.. కళలకు నిలయం..
హైదరాబాద్ నగరం అంటే కేవలం బిర్యానీ, ఐటీ పరిశ్రమలకే కాదని.. కళలకు కూడా నిలయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మన నగరం ఐటీ, ఫార్మా రంగాల్లో దూసుకుపోవడమే కాకుండా.. సినిమా రంగానికి కూడా గ్లోబల్ హబ్‌‌గా మారుతున్నదని చెప్పారు. గతంలో మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించినప్పుడు కూడా హైదరాబాద్ అత్యంత సురక్షితమైన నగరంగా గుర్తింపు పొందిందని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ గొడవలు జరిగినా, మన హైదరాబాద్‌‌లో మాత్రం ప్రశాంతమైన వాతావరణం ఉంటుందన్నారు. 

ఈ నగరంపై ఇక్కడి ప్రజలకు, ప్రపంచానికి ఉన్న నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తున్నదని పేర్కొన్నారు. అందుకే అంతర్జాతీయ సంస్థలు ఇక్కడికి పెట్టుబడులతో రావడానికి ఆసక్తి చూపుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ ప్రశాంతత, ఇక్కడి వసతులు సినిమా షూటింగ్‌‌లకు ఎంతో అనుకూలమని  తెలిపారు. ఇక్కడి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని,  సినీరంగం అభివృద్ధికి అవసరమైన ప్రతి అడుగులోనూ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీని ఇచ్చారు.

తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం..
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, రామానాయుడులాంటి మహానుభావులు పరిశ్రమకు నాలుగు స్తంభాలుగా నిలిచారని సీఎం రేవంత్‌‌రెడ్డి పేర్కొన్నారు. వారి కృషి వల్లే హైదరాబాద్ నేడు దేశానికే ఒక సినిమా హబ్‌‌గా ఎదిగిందని ప్రశంసించారు. బాహుబలి, ట్రిపుల్ ఆర్, కల్కి, పుష్పలాంటి చిత్రాలు నేడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పారు. ఈ విజయాల వెనుక మన తెలుగు వారి కష్టం,  పట్టుదల దాగి ఉన్నాయని సీఎం అన్నారు. పాన్ ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ మూవీస్ మన నగరం నుంచి వస్తుండటం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. 

ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, కమల్‌‌హాసన్‌‌లాంటి దిగ్గజాలు పాల్గొనడం ఇక్కడి కళాకారులకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు.  సీనియర్ల అనుభవంతోపాటు యువత ఆలోచనలు కలిసినప్పుడే సినిమా పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.  సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని  స్పష్టం చేశారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరుతో ఈ అవార్డులను అందజేయడం వెనుక ఒక గొప్ప ఆశయం ఉందని తెలిపారు.

గద్దర్ అంటే ఒక వ్యక్తి కాదని, ఆయన ఒక చైతన్యమని, సామాజిక సమస్యలపై ఆయన చేసిన పోరాటం మరువలేనిదన్నారు. సినిమా అనేది సమాజంలోని రుగ్మతలను తొలగించే ఒక శక్తివంతమైన ఆయుధంగా ఉండాలని సూచించారు.  గద్దర్ పాటలు ఏ విధంగా ప్రజలను ప్రభావితం చేశాయో, అదే రీతిలో నేటి సినిమాలు ఉండాలని ఆయన సూచించారు. 

గద్దర్ అవార్డుల ద్వారా ఉత్తమ ప్రతిభావంతులను గుర్తించి సత్కరించడం తమ ప్రభుత్వానికి దక్కిన గౌరవమని చెప్పారు. చిన్న సినిమాలకు థియేటర్ల సమస్య లేకుండా త్వరలో ఒక స్పష్టమైన పాలసీని తీసుకురానున్నట్టు సీఎం రేవంత్‌‌ వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ఈ అవార్డుల వేడుకను మరింత ఘనంగా నిర్వహిస్తామన్నారు.

అట్టహాసంగా అవార్డుల ప్రదానోత్సవం
మాదాపూర్‌‌ హైటెక్స్‌‌ కన్వెన్షన్‌‌ సెంటర్‌‌‌‌లో  తెలంగాణ గద్దర్‌‌ ఫిల్మ్‌‌ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికెట్ పొందిన చిత్రాలకు సంబంధించి ఇప్పటికే విజేతల వివరాలను ప్రకటించారు. వారందరికీ  ప్రశంసా పత్రంతోపాటు నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్​ రాంబాయి  నిలిచింది. ఉత్తమ రెండో చిత్రంగా దండోరాకు పురస్కారం దక్కింది. ఉత్తమ దర్శకుడిగా సాయిలు కంపాటి, ఉత్తమ నేపథ్య గాయకుడిగా అనురాగ్‌‌ కులకర్ణి, ఉత్తమ డెబ్యూ డైరెక్టర్​గా సాయి మార్తాండ్‌‌ పురస్కారాలను అందుకున్నారు. 

ఉత్తమ నటుడిగా- నాగ చైతన్య(తండేల్), ఉత్తమ నటిగా - రష్మికకు (ది గర్ల్ ఫ్రెండ్) పురస్కారం దక్కింది. ప్రత్యేక కేటగిరీ కింద ఎన్టీఆర్‌‌ జాతీయ అవార్డు చిరంజీవిని వరించింది. కమలాసన్‌‌కు పైడి జయరాజ్‌‌ అవార్డు, సింగీతం శ్రీనివాస్‌‌రావుకు బీఎన్‌‌రెడ్డి ఫిల్మ్‌‌ అవార్డు, అశ్వినీదత్‌‌కు నాగిరెడ్డి చక్రపాణి అవార్డు, సుద్దాల అశోక్‌‌తేజకు సినారె ఫిల్మ్‌‌ అవార్డు అందజేశారు.  అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్‌‌ అవార్డు సహజనటి జయసుధ, కె.ఎల్‌‌.కాంతారావు ఫిల్మ్‌‌ అవార్డు ఆర్‌‌ నారాయణమూర్తి, రఘుపతి వెంకయ్య ఫిల్మ్‌‌ అవార్డును నిర్మాత రమేశ్‌‌ ప్రసాద్‌‌ అందుకున్నారు.

అవార్డులతో కళాకారులను రేవంత్‌‌ గౌరవిస్తున్నరు: చిరంజీవి
హైదరాబాద్, వెలుగు: కళాకారులను గౌరవించిన రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని నటుడు చిరంజీవి అన్నారు. గద్దర్‌‌‌‌ అవార్డులతో సినీ ఆర్టిస్ట్‌‌లను సీఎం రేవంత్‌‌ గౌరవిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. సినిమాకు ఎంతో దగ్గరగా ఉండే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ఆలోచించి..  అవార్డులను పునరుద్ధరించాలని కోరారు.

గద్దర్‌‌‌‌ ఫిలిం అవార్డుల్లో భాగంగా ఎన్టీఆర్‌‌ జాతీయ అవార్డు చిరంజీవిని వరించింది. ఈ అవార్డును చిరంజీవికి సీఎం రేవంత్‌‌, బాలీవుడ్‌‌ సీనియర్‌‌ నటి మాధురీ దీక్షిత్‌‌ అందజేశారు. ప్రశంసాపత్రంతోపాటు రూ. పది లక్షల నగదు బహుమతిని ఇచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..  ఒక సమయంలో కుంటుపడిన అవార్డులను సీఎం రేవంత్‌‌రెడ్డి పునరుద్ధరించారని అన్నారు.  ఆయనను కలిసిన ప్రతిసారీ సినిమా అభివృద్ధి గురించే మాట్లాడతారని, సినిమాకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యానికి మనమంతా రుణపడి ఉండాలి అని అన్నారు.

గద్దర్‌‌‌‌ పేరుతో అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉంది: డిప్యూటీ సీఎం భట్టి
గద్దర్‌‌‌‌ ఫిలిం అవార్డు గ్రహీతలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. ‘‘తెలుగు సినిమా తెలంగాణకు మాత్రమే కాకుండా దేశానికే తలమానికం కావాలని సీఎం రేవంత్‌‌ కృషి చేస్తున్నారు. పదేండ్లలో పెండింగ్‌‌లో ఉన్న అవార్డులను పునరుద్ధరించారు.  గద్దర్‌‌ పేరుతో అవార్డును అందజేయడం ఆనందంగా ఉంది” అని భట్టి అన్నారు.