దేశానికే ఆదర్శంగా టీఎస్ జెన్కో: సీఎండీ దేవులపల్లి ప్రభాకర రావు

దేశానికే ఆదర్శంగా టీఎస్ జెన్కో:  సీఎండీ దేవులపల్లి ప్రభాకర రావు

పాల్వంచ, వెలుగు: రైతులకు 24గంటలు ఉచిత కరెంట్​ అందిస్తూ తెలంగాణ జెన్కో దేశానికే ఆదర్శంగా నిలిచిందని టీఎస్​జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర రావు చెప్పారు. శనివారం పాల్వంచలో రూ.30 కోట్లతో నిర్మించిన జెన్కో శిక్షణా కేంద్రం, సిమ్యులేటర్, ఆక్సిజన్ ప్లాంట్లను కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుతో  కలిసి ప్రారంభించారు. అనంతరం సీఎండీ మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు హైదరాబాద్ వచ్చి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై పరిశోధనలు చేస్తూ  ప్రశంసిస్తున్నారని తెలిపారు. 

వైటీపీఎస్ లో ఈ ఏడాది చివరి నాటికి రెండు యూనిట్ల నుంచి 1,600 మెగావాట్ల విద్యుత్​ఉత్పత్తి చేస్తామని, 2024 నాటికి మరో3యూనిట్లను అందుబాటులోకి తెస్తామన్నారు.3వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు పర్మిషన్​తీసుకోవాల్సి ఉందన్నారు. సీఎం కేసీఆర్ ప్రోత్సహంతోనే ఇన్ని పనులు చేపడుతున్నట్లు చెప్పారు. జెన్కో శిక్షణా కేంద్రంలో సీఎండీతోపాటు ఎమ్మెల్యే మొక్కలు నాటారు. డైరెక్టర్లు ఎ.అజయ్, లక్ష్మయ్య, సచ్చిదానందం, వెంకటరాజం, జగత్ కుమార్ రెడ్డి, టీఆర్ కే రావు, ఓఎస్డీ విజిలెన్స్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.