- నైపుణ్యాభివృద్ధికి అరుదైన గుర్తింపు... ఇకపై రాష్ట్రంలోనే శిక్షణ, పరీక్షలు, సర్టిఫికేషన్
హైదరాబాద్: వెలుగు: తెలంగాణ యువతను ప్రపంచస్థాయి నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక మైలురాయిని అధిగమించింది. రాష్ట్ర ఉపాధి, శిక్షణ శాఖకు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీవీఈటీ) నుంచి ‘అవార్డింగ్ బాడీ’గా అధికారిక గుర్తింపు లభించింది. ఈ మేరకు ఇటీవల ఢిల్లీలో ఒప్పందం కుదిరింది. కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీస్ శాఖ స్పెషల్ సీఎస్ దానకిషోర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ పూర్తయింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఐటీఐలు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు) శిక్షణ సంస్థలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరించడంతో ఆయన కీలక పాత్ర పోషించారు.
ఈ ఒప్పందం వల్ల తెలంగాణ స్కిల్ ఎకోసిస్టమ్‌కు పూర్తిస్థాయి స్వయం ప్రతిపత్తి లభించింది. గతంలో సర్టిఫికేషన్ కోసం జాతీయ సంస్థల మీద ఆధారపడాల్సి వచ్చేది. ఇకపై రాష్ట్రమే స్వయంగా శిక్షణ ఇచ్చి, పరీక్షలు నిర్వహించి, జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన సర్టిఫికెట్లను జారీ చేస్తుంది. భవిష్యత్ అవసరాలైన రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ , డ్రోన్ టెక్నాలజీ, హెల్త్‌కేర్, స్మార్ట్ అగ్రికల్చర్, ఫ్యాషన్ డిజైన్ వంటి రంగాల్లో శిక్షణను కార్మిక ఉపాధి కల్పన శాఖ ముమ్మరం చేయనుంది. ఇప్పటికే ఎన్సీవీఈటీ ఆమోదం పొందిన ‘ఇంటిగ్రేటెడ్ స్టెమ్ సిస్టమ్స్ డిజైన్ అండ్ప్రోటోటైపింగ్ జూనియర్ టెక్నీషియన్’ వంటి కోర్సుల ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమేషన్ రంగాల్లో యువతకు అపార అవకాశాలు లభించనున్నాయి.
ఢిల్లీలో ఒప్పందం...
కేంద్ర ఎంఎస్డీఈ కార్యదర్శి, ఎన్సీవీఈటీ చైర్‌పర్సన్ దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధి శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ, జాయింట్ డైరెక్టర్ నగేష్, డిప్యూటీ డైరెక్టర్ రాజా పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సంకల్పం మేరకు తెలంగాణను దేశానికే ‘స్కిల్ హబ్’గా మార్చే దిశగా ఈ ఒప్పందం కుదిరిందని అధికారులు పేర్కొన్నారు. దీనివల్ల శిక్షణ పూర్తికాగానే కార్మిక ఉపాధి శాఖ ద్వారా నేరుగా సర్టిఫికెట్లు అందుతాయని, తద్వారా గ్లోబల్ కెరీర్ అవకాశాలు మెరుగుపడతాయని అధికారులు చెబుతున్నారు.

