సర్కారు సంస్థలే కరెంటు బిల్లులు కడ్తలే

సర్కారు సంస్థలే కరెంటు బిల్లులు కడ్తలే

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ సంస్థలు కరెంటు బిల్లులు కట్టడం లేదు. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌కు నాలుగు సంస్థలు పెద్ద ఎత్తున బాకీ పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి వీటి కరెంటు బిల్లు బాకీలు వందల కోట్లు ఉంటే.. ఇప్పుడు వేల కోట్లకు చేరాయి. మూడేళ్లుగా ఏటా రూ.3 వేల కోట్లకు పైగా బకాయిలు పెరుగుతున్నాయి. ఈ 8 ఏండ్లలో 18 వేల కోట్లు పేరుకుపోయాయి. దీంతో కరెంటు కొనుగోళ్లకు డబ్బులు లేక, అప్పులు పుట్టక డిస్కమ్‌లు ఆగమవుతున్నాయి. ప్రతినెల ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి అప్పులు చేయాల్సిన దుస్థితిలో ఉన్నాయి. ఇప్పటికే కరెంటు వినియోగదారులపై ఏప్రిల్‌ 1 నుంచి  రూ.5,596 కోట్ల అదనపు భారం మోపాయి.

అప్పుడు రూ.1,302 కోట్లు

డిస్కమ్‌లకు రావాల్సిన బకాయిలపై ఇటీవల విద్యుత్ అధికారులు లెక్కలు తీశారు. అందులో నాలుగు ప్రభుత్వ సంస్థల బాకీలే రూ.18 వేల కోట్లకు పైగా ఉన్నట్లు గుర్తించారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పంపులకు కరెంటు వినియోగం, పంచాయతీరాజ్‌, మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల స్ట్రీట్‌ లైట్లు, నీటి సరఫరాకు, హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ సంస్థ నీటి పంపింగ్‌ కోసం వినియోగించే కరెంట్ బాకీలే ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. వీటికి 2014 మార్చి 31 నాటికి రూ.1,302.03 కోట్ల బాకీలు ఉండేవి. అయితే కరెంటు వాడుకునుడే తప్ప బిల్లులు కట్టకపోవడంతో గత 8 ఏండ్లలో వేల కోట్లకు చేరిపోయాయి. ఇందులో లిఫ్ట్ ఇరిగేషన్‌ స్కీమ్‌ బిల్లులే ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయి. 2014 మార్చి 31 లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్స్‌ కోసం వాడిన కరెంటు బకాయిలు రూ.106.92 కోట్లు మాత్రమే ఉండేవి. తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి, ఇతర లిఫ్ట్‌లకు వాడే కరెంటు వినియోగం భారీగా పెరిగింది. మార్చి 31 నాటికే ఇరిగేషన్ శాఖ డిస్కంలకు రూ.8 వేల కోట్ల వరకు కరెంటు బిల్లుల బకాయిలు పడినట్లు తేలింది. 

మరోవైపు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగించే స్ట్రీట్‌ లైట్లు, నీటి సరఫరాకు వినియోగించే కరెంటు బిల్లు బాకీలు కూడా వేలకోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. పంచాయతీరాజ్‌లో స్ట్రీట్‌ లైట్‌లకు వినియోగించే లోటెన్షన్‌ కరెంటు బిల్లుల బాకీ  రూ.3,800 కోట్లకు పైగా పెరిగిపోయాయి. ఆర్‌డబ్ల్యుఎస్‌ స్కీమ్‌లో భాగంగా గ్రామీణ నీటి సరఫరాల కోసం వినియోగించే కరెంటు బాకీలు రూ.1,800 కోట్లకుపైగా పెరిగాయి. మొత్తంగా పంచాయతీ రాజ్‌ డిపార్ట్‌మెంట్ బాకీలే రూ.5,600 కోట్లకు పైగా ఉన్నాయి. మున్సిపాల్టీల అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ కరెంటు వినియోగం, స్ట్రీట్‌ లైట్‌ల కరెంటు బిల్లుల బాకీ నేటికి రూ.1,200 కోట్లకు పైగా చేరింది. ఇందులోనే హైటెన్షన్‌ కరెంటు బిల్లులు మరో 350 కోట్లకు చేరాయి. ఇక హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ బాకీలు కూడా రూ.2,750 కోట్ల వరకు చేరాయి.