రేపటి నుంచి 9 జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్ల పంపిణీ

రేపటి నుంచి 9 జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్ల పంపిణీ

గర్భిణుల్లో రక్తహీనత తగ్గి తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండటం పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. మాతృ మరణాలను నివారించడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. గర్భిణీ స్త్రీలలో రక్తహీనత లోపం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన 9  జిల్లాల్లో రేపటి నుంచి ఈ కిట్ల పంపిణీ ప్రారంభం కానుంది. 

న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి ఏర్పాట్లు 

ఇప్పటికే రాష్ట్రంలో ప్రారంభించిన కేసీఆర్ కిట్ హిట్ కావడంతో.. అదే స్ఫూర్తితో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను రూపొందించారు. సీఎం ఆదేశాల మేరకు రేపటి నుంచి ఈ కిట్ల పంపిణీకి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కామారెడ్డి కలెక్టరేట్ నుంచి వర్చువల్ విధానంలో పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నారు. అదే సమయంలో మిగతా 8 జిల్లాల్లో జరిగే కార్యక్రమంలో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. 

రక్తహీనత ఎక్కువగా ఉన్న జిల్లాలు

రక్తహీనత ప్రభావం ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్‌, భ‌ద్రాద్రి కొత్తగూడెం, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, జోగులాంబ గ‌ద్వాల్‌, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ములుగు, నాగ‌ర్ క‌ర్నూల్‌, వికారాబాద్ జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. అంచనాల ప్రకారం, 1.25 లక్షల మంది గ‌ర్బిణుల‌కు ఇది ఉప‌యోగ‌ప‌డనుంది. మొత్తంగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీని కోసం ప్రభుత్వం రూ. 50 కోట్లు ఖర్చు చేస్తోంది. 9 జిల్లాల్లోని 231 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వం ఈ కిట్లను పంపిణీ చేయనుంది. న్యూట్రిషన్ కిట్ లలో ఒక కిలో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, 2 కిలోల ఖర్జూరం, 3 బాటిల్స్ ఐరన్ సిరప్, 500 గ్రాముల నెయ్యి, అల్బెండజోల్ టాబ్లెట్, కప్పు, ఒక ప్లాస్టిక్ బాస్కెట్ ఉంటాయి.