- ఆయిల్ ఫెడ్‌కు కేటాయించిన ప్రభుత్వం
- ప్రస్తుతం రాష్ట్రంలో 2.82 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు
- మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవతో పెరిగిన ఉత్పత్తి శాతం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు అభివృద్ధి కోసం కేటాయించిన ఫ్యాక్టరీ జోన్లలో నిబంధనలు పాటించని ప్రైవేటు కంపెనీలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. పురోగతి సాధించని కంపెనీలకు ఫ్యాక్టరీ జోన్లను రద్దు చేస్తూ, ఆ ప్రాంతాలను ఆయిల్ ఫెడ్ కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయిల్ పామ్ చట్టం-1993, నిబంధనలు-2008 ప్రకారం.. రైతుల మొక్కలు నాటిన 36 నెలల్లోపు ఆయిల్ పామ్ కంపెనీలు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలి.
ఫ్యాక్టరీ జోన్ పరిధిలో రైతులకు సేవలు అందించాల్సి ఉంటుంది. అయితే, కొన్ని కంపెనీలు ఈ నిబంధనలను ఉల్లంఘించడం, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, నాట్ల విస్తరణ, నర్సరీ అభివృద్ధి వంటి అంశాల్లో నిర్లక్ష్యం వహించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కరీంనగర్ జిల్లాలో కేటాయించిన 44,527 ఎకరాల ఫ్యాక్టరీ జోన్‌లో 6,721 ఎకరాల్లో మాత్రమే ఆయిల్ పామ్ సాగు జరిగింది. దీంతో ఈ జిల్లాకు చెందిన ఫ్యాక్టరీ జోన్‌ను రద్దు చేసి, ఆయిల్ ఫెడ్‌కు కేటాయించారు.
మ్యాట్రిక్స్ పామ్ ఆయిల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కేటాయించిన 30,552 ఎకరాల్లో కేవలం 1,606 ఎకరాలు, కేఎన్ బయోసైన్సెస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు హన్మకొండ, వరంగల్ జిల్లాల్లోని 11 మండలాల్లో కేటాయించిన 14 వేల ఎకరాల లక్ష్యంలో 2,136 ఎకరాల్లో మాత్రమే సాగు జరగడంతో వీటి ఫ్యాక్టరీ జోన్లను కూడా రద్దు చేశారు. ఈ ప్రాంతాలను ఆయిల్ ఫెడ్‌కు కేటాయించారు.
