యాదగిరిగుట్ట విమాన గోపురం ఇక స్వర్ణమయం

యాదగిరిగుట్ట విమాన గోపురం ఇక స్వర్ణమయం
  • ఈ నెలాఖరు నుంచి  బంగారం తాపడం పనులు
  • 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గోల్డ్  కోటింగ్
  • మొత్తం 60  కిలోల బంగారం అవసరమని నిర్ధారణ
  •  చెన్నైకి చెందిన ఎస్ఎం స్మార్ట్  క్రియేషన్ కంపెనీకి పనులు 

హైదరాబాద్, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి విమాన గోపురం ఇక స్వర్ణమయం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులోగా బంగారు తాపడం పనులు ప్రారంభించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. చెన్నైకి చెందిన ఎంఎస్​ స్మార్ట్​ క్రియేషన్​ కంపెనీకి బంగారం తాపడం పనుల బాధ్యతను అప్పగించారు. కొన్నేళ్ల క్రితం ఇదే కంపెనీ యాదాద్రి ఆలయ ప్రధాన  గోపురం, ధ్వజస్తంభం పనులను పూర్తి చేసింది. ఆ కంపెనీ వారు చేపట్టిన పనులు ఏళ్లుగా చెక్కుచెదరకపోవడంతో ప్రభుత్వం మళ్లీ అదే కంపెనీకి బంగారు తాపడం పనులు అప్పగించింది.

బంగారు తాపడం పనుల్లో భాగంగా ఇప్పటికే రాగిరేకుల పనిని పూర్తి చేశారు.  దానిపై దేవుళ్ల ప్రతిరూపాలను చెక్కారు. ఈ పనులు పూర్తి చేయడానికి రూ.6 కోట్లు వరకు ఖర్చయింది. అయితే, దసరా పండుగ తర్వాత రాగిరేకులను చెన్నైలోని  కంపెనీకి  తరలించనున్నారు. ఇక విమాన గోపురానికి మొత్తం 60 కిలోల బంగారం అవసరం అవుతుందని దేవాదాయ శాఖ అంచనా వేయగా..  ప్రస్తుతం ఆలయం వద్ద  పాత బంగారం 13 కిలోలు ఉంది. ఇందులో పది కిలోలు విరాళాల రూపంలో రాగా..  మరో మూడు కేజీల బంగారం ఆలయంలో భక్తులు హుండీలో సమర్పించారు. ఈ బంగారానికి చర్లపల్లిలోని మింట్​కు తరలించి ప్యూర్​ గోల్డ్​గా మార్చనున్నారు.

ఇప్పటికే ఈ  ప్రక్రియ మొదలుపెట్టారు. దీనికితోడు ఆలయానికి డోనేషన్ల రూపంలో రూ.20 కోట్లు వచ్చాయి.  ప్రభుత్వం నిర్ణయించిన తేదీ రోజు ఆర్బీఐకి  అప్పగించి అంతే విలువ చేసే బంగారాన్ని తీసుకుని బంగారం తాపడం తయారుచేసే కంపెనీకి చెన్నైలో
అప్పగించనున్నారు. మొత్తం కలిపితే 41 కిలోల బంగారం అవుతుంది.  దీనికితోడు ఆలయం వద్ద మిశ్రమ బంగారం 10  కేజీల వరకు ఉంటుందని తెలిసింది. దీన్ని కూడా చర్లపల్లిలోని మింట్​కు తరలించి ప్యూర్​ గోల్డ్​గా మార్చనున్నారు. ఆ బంగారాన్ని ప్యూర్​ గోల్డ్​గా మార్చిన తర్వాత చెన్నై కంపెనీకి పంపించిఈ నెలాఖరులోగా పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  

మ్యాన్​వల్​గా చేస్తే 100 కిలోలు 

గత బీఆర్ఎస్  ప్రభుత్వం విమాన గోపురానికి సంబంధించి గోల్డ్  కోటింగ్  పనులను రెండు రకాలుగా చేపట్టాలని భావించింది. మ్యాను​వల్​గా చేపట్టాలని యోచించింది.  ఇలా అయితే దాదాపు 100 కేజీల వరకు బంగారం అవసరమవుతుంది. దీనికితోడు యాదగిరిగుట్టలో పనులు చేసేవారి కోసం క్యాంప్​ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.  మ్యానువల్​గా చేస్తే పనులు ఆలస్యం కావడంతోపాటు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని భావించి నాటి ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

మ్యానువల్​గా చేసే క్రమంలో పాదరసం ఉపయోగించాల్సి ఉంటుంది. దీంతో వాతావరణానికి హాని కలుగుతుంది. దీంతో మెషనరీతో తయారు చేయాలని నిర్ణయించింది. అయితే,  డోనేషన్ల రూపంలో బంగారం, డబ్బులు సేకరించి పనులు పూర్తి చేయాలని భావించినా..  అనుకున్న స్థాయిలో రాలేదు. దీంతో బంగారం తాపడం పనులు ముందుకు సాగలేదు. రాగి తొడుగుల వరకే పరిమితమైంది. అప్పటి ప్రభుత్వం నిధులు కూడా  కేటాయించకపోవడంతో పనులు ఆగిపోయాయి. అయితే,  సీఎం రేవంత్​రెడ్డి విమాన గోపురం పనులకు సంబంధించి ఇటీవల సమీక్ష నిర్వహించి బంగారు తాపడం పనులు ప్రారంభించాలని సూచించారు.  దీంతో మళ్లీ విమాన గోపురం పనుల్లో వేగం పుంజుకోనున్నది. 

పనుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ..

బంగారం తాపడం పనులను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజను ఈ కమిటీకి చైర్ పర్సన్ గా నియమించారు. కన్వీనర్ గా దేవాదాయ శాఖ డైరెక్టర్,  సభ్యులుగా ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్  సలహాదారు, వైటీడీఏ వైస్ చైర్మన్  జి.కిషన్ రావు, యాదగిరిగుట్ట దేవస్థానం నిర్వహణ అధికారి భాస్కర్​ రావు, విద్యుత్ శాఖ చీఫ్  ఇంజినీర్  ఉన్నారు. కాగా.. బంగారం తాపడం పనులను మార్చిలో బ్రహ్మోత్సవాల వరకు పనులు పూర్తిచేసేలా చూస్తామని ఆలయ ఈఓ భాస్కర్ రావు తెలిపారు.

మెషినరీతో చేస్తే 60 కేజీలు 

యాదగిరిగుట్ట గోపురం పనులన్నీ చెన్నైలోనే జరగనున్నాయి. ఈ పనులను మెషనరీ ద్వారా చేస్తే కేవలం 60 కేజీల బంగారం అవసరమవుతుంది. దీనికితోడు పనులు వేగంగా జరగడంతోపాటు దుర్వినియోగానికి అవకాశం ఉండదు. అయితే,  10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయ గోపురం పనులు చేపట్టాల్సి ఉంది. గతంలో ఆలయ మెయిన్​ గోపురం, ధ్వజస్తంభం పనులు చేపట్టిన కంపెనీకే ఈ గోపురం పనులు అప్పగించారు.

వీరు గతంలో ఆలయానికి సంబంధించిన మెయిన్​ గోపురం, ధ్వజస్తంభం పనులు చేసినప్పుడు ఒక చదరపు అడుగుకు రూ.3,900 తీసుకున్నారు. ప్రస్తుతం అదే ధరకు పనులు చేసేందుకు ముందుకు రావడంతో ప్రభుత్వం మళ్లీ ఆ కంపెనీకే అప్పగించింది. విమాన గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తికావడానికి దాదాపు రూ.3.90 కోట్ల వరకు అవుతుందని దేవాదాయ అంచనా వేస్తున్నది. బంగారం, నగదు ఏమైనా తక్కువ పడితే గుట్ట ఆలయానికి వచ్చిన నిధులు ఖర్చు చేయనున్నారు.