మారేడుమిల్లిలో మరో ఎన్‌‌‌‌కౌంటర్ ఏడుగురు మావోయిస్టులు మృతి

మారేడుమిల్లిలో మరో ఎన్‌‌‌‌కౌంటర్ ఏడుగురు మావోయిస్టులు మృతి
  • వీరిలో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు
  • మృతుల్లో టెక్ శంకర్, జ్యోతి, సురేశ్ తదితరులు 
  • రెండు ఏకే 47, ఇతర ఆయుధాలు స్వాధీనం 
  • ఒకే ప్రాంతంలో రెండ్రోజుల్లో 13 మంది మావోయిస్టులు మృతి

భద్రాచలం, వెలుగు: ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో మరో ఎన్‌‌‌‌కౌంటర్ జరిగింది. అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని జీఎం వలస అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. వీరిలో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. చనిపోయిన మావోయిస్టులను ఆంధ్రా–ఒడిశా బార్డర్ (ఏవోబీ), చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లోని జేగురుగొండ కమిటీలకు చెందినోళ్లుగా పోలీసులు గుర్తించారు.

ఏవోబీ వెపన్​ఇన్‌చార్జ్‌ జోగారావు అలియాస్​టెక్​శంకర్, డివిజన్​కమిటీ సభ్యురాలు జ్యోతి అలియాస్ సీత, సౌత్​జోనల్​కమిటీ సభ్యుడు సురేశ్​అలియాస్​రమేశ్, జేగురుగొండ మిలీషియా కమాండర్​లోకేశ్​అలియాస్​ గణేశ్, డిప్యూటీ కమాండర్​శ్రీను అలియాస్​ వాసు, డివిజన్​కమిటీ సభ్యులు అనిత, షమ్మీగా నిర్ధారించారు. మృతదేహాలను రంపచోడవరం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో రెండు ఏకే- 47 తుపాకులు సహా భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పాడేరు ఎస్పీ అమిత్​బర్దర్​తెలిపారు. 

పారిపోయిన మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. గత రెండ్రోజుల్లో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో మొత్తం 13 మంది మావోయిస్టులు చనిపోయినట్టు వివరించారు. ఏవోబీలో కొంతకాలంగా రిక్రూట్‌మెంట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాగా, మారేడుమిల్లి అడవుల్లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు చనిపోయారు. అదే ప్రాంతంలో మళ్లీ ఎన్‌కౌంటర్ జరగడం సంచలనంగా మారింది.   

సరిహద్దుల్లో హైటెన్షన్.. ​

ఏపీలో వరుసగా రెండు ఎన్‌కౌంటర్లు జరగడంతో ఆంధ్రా, తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర బార్డర్లలో హైటెన్షన్​నెలకొంది. కేంద్రం చేపట్టిన ఆపరేషన్​కగార్‌‌తో  దండకారణ్యంలోని మావోయిస్టులు చెల్లాచెదురయ్యారు. వాళ్లంతా షెల్టర్​జోన్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలోని పలు పట్టణాల్లో తలదాచుకుంటున్న మావోయిస్టులు పోలీసులకు దొరికారు. 

మిగిలిన ప్రాంతాల్లోనూ మావోయిస్టులు సంచరిస్తున్నారనే అనుమానంతో 5 రాష్ట్రాల సరిహద్దుల్లోని ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెట్టారు. బార్డర్లు దాటే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రతి పోలీస్​స్టేషన్​పరిధిలో హైఅలర్ట్ ప్రకటించారు. గోదావరి ఫెర్రీ పాయింట్ల వద్ద నిఘా పెంచారు. లొంగిపోయిన మావోయిస్టులు, కొరియర్లు, ఇన్‌ఫార్మర్ల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.