- బీఆర్ఎస్ లీడర్లు ఇసుక దందాతో కోట్లు కొల్లగొట్టిన్రు
- మేం అధికారంలోకి రాగానే ఆ దందాపై ఉక్కుపాదం మోపినం
- ఇసుక రాయల్టీని నిరుటి కన్నా 18శాతం అధికంగా వసూలు చేసినం
- ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఫ్రీగా ఇసుక ఇస్తున్నం
- ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని వెల్లడి
- మంచిర్యాల జిల్లా బావురావుపేటలో శాండ్ బజార్ ప్రారంభం
- కిష్టంపేట రైతు వేదిక వద్ద ఇందిరమ్మ చీరల పంపిణీ
కోల్‌బెల్ట్ / చెన్నూరు,వెలుగు: టీజీఎండీసీ ఆధ్వర్యంలో శాండ్ బజార్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకే ఇసుక అందిస్తున్నట్టు రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఇంటి నిర్మాణాలకు సులభంగా ఇసుక దొరికేలా చేయడం, ఇసుక అక్రమ రవాణాను అరికట్టడం కోసం ఈ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బుధవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బావురావుపేటలో శాండ్ బజార్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను ఫ్రీగా అందజేస్తున్నట్లు చెప్పారు. గత బీఆర్ఎస్ పాలనలో చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ లీడర్లు విచ్చలవిడిగా ఇసుక దందాకు పాల్పడి కోట్లు అక్రమంగా సంపాదించారని మండిపడ్డారు.
రోడ్లమీద వేలాది లారీలు నిలపడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. ఎన్నికల టైమ్‌లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఇసుక దందా బంద్ చేయించానని ఆయన తెలిపారు. ఈ విషయంలో కొందరు తనపై ఒత్తిడి తెచ్చినా చాన్స్ ఇవ్వలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపినట్టు తెలిపారు. ‘‘ఇసుక దందాను అడ్డుకోవడంతో కొందరు తప్పుడు ప్రచారం చేశారు. పత్రికల్లో తప్పుడు కథనాలు రాయించారు.
కానీ, ఎవరు ఇసుక దందాకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లకు ఆదేశాలిచ్చాను” అని వివేక్ చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గతేడాది కన్నా ఈ సారి 18 శాతం అధికంగా రాయల్టీ కలెక్ట్ చేశామన్నారు.
ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలుకు కేంద్రంపై ఒత్తిడి
ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసేలా సీసీఐ, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకువస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ‘‘గతంలో ఎకరాకు 12క్వింటాళ్లు పత్తి కొన్న సీసీఐ.. ఇప్పుడు 7క్వింటాళ్లకు తగ్గించడం సరికాదు. కేంద్రం, సీసీఐ నిర్ణయం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతుల సమస్యను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సీసీఐ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు. ఎంపీ వంశీకృష్ణ, నేను వచ్చే వారం ఢిల్లీకి వెళ్లి ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తాం” అని ఆయన వెల్లడించారు.
మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం
మహిళా సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా చెన్నూరు మండలం కిష్టంపేట రైతువేదికలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్కలెక్టర్ చంద్రయ్య, డీఆర్డీవో కిషన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అంతకుముందు.. సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కిష్టంపేట రైతువేదిక నుంచి మంత్రి పాల్గొన్నారు.
చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. రాష్ట్ర సర్కార్ మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నదని, మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నదని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో మహిళలకు ఒక్కొక్కటి రూ. 30 లక్షలతో 16 ఎలక్ట్రిక్ బస్సులను అందించామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో పేదలకు చేసిందేమీ లేదని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని
పేర్కొన్నారు.
చెన్నూరు అభివృద్ధి పనులకు రూ.16 కోట్లు
చెన్నూరు టౌన్లో అభివృద్ధికి రూ. 16 కోట్లు కేటాయించినట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈ నిధులతో వార్డుల్లో పెండింగ్‌లోని పనులను నాలుగు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. 50 పడకల చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిని 100 బెడ్స్ కు అప్‌గ్రేడ్ చేస్తామని పేర్కొన్నారు. ఆరు డయాలసిస్ ప్లాంట్లను పదికి పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మంచిర్యాల జిల్లాలో 20 వేల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో 60 వేల కుటుంబాలకు ప్రయోజనం కలిగిందని తెలిపారు.
జిల్లాలో 8 వేల ఇండ్ల నిర్మాణాల్లో 5 వేల ఇండ్లు బెస్మెంట్ లెవల్ దాటాయని.. ఈ ఏడాది జిల్లాకు మరో 10,500 ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. సోమనపల్లిలో రూ. 250 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామని, అన్ని పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు తదితర పనులకు నిధులు మంజూరు చేస్తున్నామని ఆయన తెలిపారు. చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తూ ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.
